సలహా వల..షేర్‌లంటూ శఠగోపం

Another company fraud to people - Sakshi

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ టోకరా 

ఇండోర్‌ వేదికగా సెబీ రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ కంపెనీల బాగోతం 

నగరానికి చెందిన నలుగురికి దాదాపు రూ.15 లక్షలకు పైగానే మోసం 

ఆయా కంపెనీ బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.3.62 కోట్లు ఫ్రీజ్‌ : సీసీ సజ్జనార్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : షేర్‌ మార్కెట్లో నమ్మకమైన సలహాలు..అంటూ వల విసిరి ఆ తర్వాత ప్యాకేజీలుగా టోకున సూచనలు ఇస్తామని బుట్టలో వేసుకొని చివరికి పెట్టుబడిపెట్టండి రూ.లక్షలు పట్టండి అంటూ శఠగోపం పెట్టిన నాలుగు బోగస్‌ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్‌లో నిర్వహిస్తున్న 4 సెబీ రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకొని ట్రాన్సిట్‌ వారంట్‌పై శనివారం నగరానికి తీసుకువచ్చారు. షేర్‌మార్కెట్‌లో లాభాలొస్తాయంటూ సలహాల పేరుతో రూ.15 లక్షల 61 వేలు మోసగించారని నలుగురు బాధితులు గతే డాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో  పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం మీడియాకు తెలిపారు.  

మొదట టెలికాలర్లు.. తర్వాత డైరెక్టర్లు 
ఎంబీఏ చదివిన స్వప్నిల్‌ ప్రజాపతి, అఖిలేష్‌ రఘువంశీ, సంతోష్‌ సింగ్‌ పరిహర్, సాగర్‌ సాహూలు సెబీ విద్యా అనుబంధ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెటీస్‌ నుంచి పీజీ డిపోమా కోర్సు లు చేసి ఆ తర్వాత సెబీ వద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ కంపెనీలుగా రిజిష్టర్‌ చేసుకున్నారు. ఈ సమయంలోనే వేర్వేరు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వై జరీ కంపెనీలో టెలికాలర్లుగా పనిచేసిన వీరు ఆ అనుభవంతో వేర్వేరు సంవత్సరాల్లో కంపెనీలు ఎవరికి వారు ఏర్పాటుచేసుకొని నిర్వహిస్తున్నారు. హైబ్రో మార్కెట్‌ రీసెర్చ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అడ్వైజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వేటూస్‌ క్యాపిటల్‌.కామ్‌ను స్వప్నిల్‌ ప్రజాపతి, ద ఇక్వికామ్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దఇక్వికామ్‌.కామ్‌ పేరుతో అఖిలేష్‌ రఘువంశీ, ట్రేడ్‌ బిజ్‌ రీసెర్చ్‌ పేరుతో ట్రేడ్‌బిజ్‌ఇండియా.కామ్‌ పేరుతో సంతోష్‌ సింగ్‌ పరిహర్, సఫల్‌ రీసెర్చ్‌ పేరుతో షఫల్‌రీసెర్చ్‌.కామ్‌ పేరుతోసాగర్‌ సాహూలు స్టాక్‌ మార్కెట్లలో అతి తక్కువ కాలంలో లాభాలంటూ డీమ్యాట్‌ ఖాతాదారులకు వల విసురుతున్నారు. ఇండోర్‌లోని విజయ్‌నగర్‌ కాలనీలో ఐటీ కంపెనీలను తలదన్నేలా సకల సౌకర్యాలతో కార్యాలయాలను నిర్వహిస్తూ 530 మంది టెలికాలర్లను నియమించుకొని రోజుకు వేలాది ఫోన్‌కాల్స్‌ చేస్తూ డబ్బును రెట్టింపు చేస్తామంటూ తియ్య టి మాటలతో కట్టిపడేస్తున్నారు. 

రూ.1.3 లక్షలు పెడితే నెలలో రూ.45 లక్షల లాభమంటూ... 
స్టాక్‌ మార్కెట్‌లో డీ మ్యాట్‌ ఖాతాదారుల వివరాలు సేకరించిన వీరు టెలికాలర్లు ద్వారా ఫోన్‌కాల్స్‌ చేస్తారు. ఫలానా సమయంలో ఫలానా షేర్‌ ధర పెరుగుతుంది, తగ్గుతుందంటూ వారిని నమ్మిస్తారు. వీరు చెప్పినట్టుగానే షేర్ల ధరలు ఉండటంతో నమ్మిన వేలాది మంది లాభాల కోసం రూ.5,900 ల రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. అలాగే 45 రోజుల్లో రూ.2,75,00 ల లాభానికి రూ. 22,499, రూ.7,50,000 లాభానికి రూ. 33,999లను ప్రాజెక్టుల రూపంలో చార్జీలు, టెక్నికల్‌ రిపోర్టుల కోసం ఒక్కోదానికి రూ.3,999 చొప్పున 20 అంటే రూ.79,980 లు వసూలు చేయడంతో పాటు 18 శాతం జీఎస్‌ టీని కూడా బాధితుల నుంచి తీసుకుంటున్నారు. లాభాల కోసం సలహాలు పక్కనపెడి తే డీ మ్యాట్‌ ఖాతా ద్వారా రూ.1,30,000లు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రూ.45 లక్షల లాభాలు వచ్చేలా చూస్తామని చెప్పడంతో పాటు చెల్లించే డబ్బులో 18 శాతం జీఎస్‌టీ, సెక్యూరిటీ డిపాజిట్‌ కింద 20 శాతం మొత్తం ముందుగానే వసూలు చేశారు. 4 గడుస్తున్నా సొమ్ములు రాకపోవడంతో బాధితులు నష్టాల్లో కూరుకుపోయారు. ఈ కంపెనీలపై సెబీ వద్ద దాదాపు 800 వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ 4 కంపెనీల మోసాలపై సెబీకి లేఖ రాస్తామని, వారికి వచ్చిన ఫిర్యాదుల చిట్టా తీసుకొని తెలంగాణ నుంచి ఎంత మంది బాధితులున్నారా అని తెలుసుకుంటామని సీపీ అన్నారు. అలాగే ఆయా కంపెనీ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ.3.62కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఇండోర్‌ వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, ఎస్‌ఐ విజయ్‌ వర్ధన్‌లను సీపీ సజ్జనార్‌ ప్రశంసించారు.  

నమ్మించి మోసగించారు.. 
నేను స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు క్రయ విక్రయాలు చేస్తుంటాను. ఒకరోజు దఇక్వికామ్‌.కామ్‌ పేరుతో స్టాక్‌ మార్కెట్‌ సలహాలు ఇస్తామంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. నమ్మలేదు. అయితే ఉదయం 9.30 నుంచి 9.45 గంటల సమయంలో ఫలానా కంపెనీ షేర్ల ధరలు ఇంత వరకు పెరుగుతాయని చెప్పారు.  నేను వారం పాటు వారి సలహాలు చూశా. చివరకు నమ్మకం వచ్చాక విడతల వారీగా డబ్బులు ఇన్వెస్ట్‌ చేశా. చివరకు ఒకసారి నేరుగా లక్ష రూపాయలు ఇస్తే ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పి మోసం చేశారు. వారి కంపెనీలో ఒకరు ఒక షేర్లు కొన్నారంటే...మరొకరు ఇంకొక షేర్లు కొన్నారని సమాధానం చెప్పడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ను సంప్రదించా.  – ఆదిత్య, బాధితుడు

ఇవీ.. తెలుసుకోండి...
నగరంతో పాటు ఏ ఇతర నగరాల్లోనైనా ఉన్న షేర్‌ ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీల సలహా తీసుకోవాలనుకుంటే వారి కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్లాలి. అక్కడ అన్నీ తెలుసుకున్నాకే మంచిదని అనుకుంటే ముందుకెళ్లాలి. స్థానిక సెబీ అధికారుల వద్ద కూడా వారి వివరాలు తెలుసుకోవాలి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top