ఫోన్‌ కొట్టు.. క్వార్టర్‌ పట్టు!

Alcohol Sale In Kurnool - Sakshi

ఫోన్‌ కొడితే చాలు.. క్షణాల్లో కావాల్సిన మద్యం బ్రాండ్‌ ఇంటి దగ్గరికి వస్తుంది. కోడుమూరు నియోజకవర్గంలో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. టీడీపీ నాయకులే గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాలు పెట్టుకొని అక్రమ మద్యం అమ్ముతున్నారు. ఓ వైపు బెల్ట్‌ దుకాణాలు కొనసాగితే పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తూ.. పరోక్షంగా ఎక్సైజ్‌ అధికారులు బెల్ట్‌ దుకాణాలను ప్రోత్సహిస్తున్న తీరు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపైపు కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యం తయారవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.  

కోడుమూరు (కర్నూలు): కోడుమూరు నియోజకవర్గంలో తెలంగాణ, కర్ణాటక మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం బెల్టు దుకాణాల నిర్వహణపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పంటపొలాలు, వాముదొడ్లలో మద్యం బాటిళ్లను నిల్వ ఉంచుతున్నారు. మందు కావాల్సిన వారు ఫోన్‌ చేస్తే క్షణాల్లో కావాల్సిన బ్రాండ్‌ తెచ్చిస్తున్నారు. అడపాదడపా దాడులు చేసి, తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి ఎక్సైజ్‌ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

అమడగుంట్ల గ్రామంలో గత నెల చంద్ర అనే మద్యం బెల్టు దుకాణ యజమాని పట్టుబడ్డాడు. అతడిని వది లేసి 80 ఏళ్ల వృద్ధురాలిని మద్యం అమ్మకాల్లో ఏ1గా చూపించి కేసు నమోదు చేశారంటే ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్యాలకుర్తిలో కేఈ సోదరుల బంధువునంటూ బెల్టు దుకాణాన్ని నడుపుతున్న ఓ వ్యక్తి ఇటీవల కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ పట్టుబడ్డాడు. భారీ ఎత్తున ఒత్తిళ్లు రావడంతో ఎక్సైజ్‌ పోలీసులు అతడిని తప్పించి సంబంధంలేని వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
 
ఏరులై పారుతున్న నాటుసారా
అల్లినగరం, రామాపురం, కొండాపురం, లద్దగిరి, కొత్తపల్లె గ్రామాల్లో నాటుసారా ఏరులైపారుతోంది. ఉల్లిందకొండ తండా వాసులు ఈ గ్రామాలకు ప్లాస్టిక్‌ బిందెల్లో నాటుసారాను తీసుకొచ్చి బెల్టు దుకాణదారులకు విక్రయిస్తున్నారు. బెల్టు దుకాణదారులు నాటుసారాను ప్యాకెట్లుగా తయారుచేసి అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడంలేదు.
 
కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యం తయారీ
కోడుమూరు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వెనుక ఓ ఇంట్లో పుట్టపాశం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్తీ మద్యాన్ని తయారుచేసి పల్లెలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కల్తీ మద్యం తయారు చేయడంలో సదరు వ్యక్తి జిల్లాలోనే పేరు మోసిన నేరస్తుడు. కల్తీ మద్యం ఎక్కడ పట్టుబడినా ఎక్సైజ్‌ పోలీసులు పుట్టపాశం కల్తీ మద్యం తయారుచేసే వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యాన్ని తయారుచేసి ఫుల్‌బాటిళ్లలోకి నింపి పెళ్లిళ్లు, జాతరలు, తిరుణాలలు జరిగే ప్రాంతాల కు సరఫరా చేసి అక్రమార్కులు యథేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top