యువ వ్యవసాయాధికారుల దుర్మరణం

Agriculture Extension Officers Died In Road Accident At Bhainsa - Sakshi

ఆదుకుంటారనుకుంటే.. అనంతలోకాలకు.. 

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం 

ఇద్దరు యువ ఏఈఓలు మృతి రోడ్డున పడ్డ కుటుంబాలు 

సాక్షి, భైంసా/భైంసారూరల్‌: చిన్న వయస్సులో ఏఈవో ఉద్యోగాలు వచ్చిన ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని వేదన మిగిల్చింది. నర్సాపూర్‌ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు యువ ఏఈ వోలు ఆదివారం సెలవు దినం కావడంతో భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామంలో వింధుకు హాజరయ్యారు. విందు ముగించుకుని సాయం త్రం 6.30 గంటలకు ద్విచక్రవాహనంపై తిరుగు పయనమయ్యారు. టోల్‌ప్లాజాకు 200 మీటర్ల దూరంలోకి రాగానే ఇసుకలోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీని వెనుకవైపు నుంచి ఢీ కొట్టారు. ఘటనలో బండి నడుపుతున్న విక్రమ్‌ తలకు తీవ్రగాయంకాగా అక్షయ్‌కుమార్‌ రెండుకాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆటో ట్రాలీలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యంకోసం అంబులెన్సులో నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విక్రమ్‌(25)మృతి చెందాడు. నిజామాబాద్‌ ఆసుపత్రిలో అక్షయ్‌కుమార్‌(25) చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్, మార్క్‌ఫెడ్‌ డీఎం కోటేశ్వర్‌రావు, ఏడీఏఅంజిప్రసాద్, ఏఓలు రాంచందర్‌నాయక్, సోమలింగారెడ్డి, టీఎన్‌జీఓస్‌ భైంసా ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీహరి, జిల్లాలో పనిచేసే ఏఈఓలు  అక్కడికి చేరుకున్నారు.  

ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్‌... 
విషయం తెలుసుకున్న నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో మృతదేహాలను చూసి కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. 

ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం 
ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉదయం 7గంటలకే భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఏఈవోలు మృతిచెందిన సంఘటన తనను కలిచివేస్తుందన్నారు.  
జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్‌ బాధిత కుటుంబీకులకు రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.  
మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుత్ను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

ఒకే మండలంలో పనిచేసి... 
2017 జనవరి 30న విక్రమ్, అక్షయ్‌కుమార్‌లు ఏఈఓలుగా ఉద్యోగంలో చేరారు. విక్రమ్‌ నర్సాపూర్‌ మండలం చాక్‌పెల్లి సెక్టార్‌లో, కునింటి అక్షయ్‌కుమార్‌ అదే మండలం రాంపూర్‌ సెక్టార్‌లో ఏఈఓగా విధులు నిర్వహిస్తుండేవారు. ఇద్దరు ఏఈఓలు మృతిచెందిన విషయం తెలుసుకున్న నర్సాపూర్‌ రైతులు తీవ్ర ఆవేదన చెందారు. 

ఇంటికి పెద్దకొడుకు అక్షయ్‌ 
కుభీర్‌ మండలం హల్దా గ్రామానికి చెందిన కునింటి హన్మండ్లు గంగాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ ముగ్గుర్ని చదివించారు. పెద్దవాడైన అక్షయ్‌కుమార్‌ ఏఈఓగా ఉద్యోగం సాధించడంతో కష్టాలు కొంతమేర గట్టెక్కాయి. రెండవ కుమారుడు అజయ్‌కుమార్, మూడవ కుమారుడు విజయ్‌కుమార్‌ డిగ్రీ చదువుతున్నారు. వయస్సు పైబడ్డ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమ ఆవేదన ఎవరికి చెప్పాలో తెలియక మృతుని సోదరులిద్దరు గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు అందరిని కలిచివేసింది. భైంసా ఏరియా ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కుభీర్‌ మండలం హల్దా గ్రామానికి తరలించారు.  

ఇంటికి పెద్దదిక్కే విక్రమ్‌ 
మామడ మండలం గాయక్‌పెల్లికి చెందిన బలి రాం కళాబాయి దంపతులకు ఐదుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఇద్దరికి వివాహం జరిపించారు. ఇదే సమయంలో విక్రమ్‌కు ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. నర్సాపూర్‌ మండలంలో ఏఈఓగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతేడాది తల్లి కళాబాయి సైతం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబానికి అన్నీతానై నడుపుతున్న ఏఈఓ విక్రమ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియ గానే వారంతా నివ్వెరపోయారు. వారి బంధువులు భైంసా ఏరియా ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top