టౌన్‌ప్లానింగ్‌ అధికారి సహా ఇద్దరు విలేకరుల అరెస్టు  | ACB Arrested GHMC Town Planning Officer And Scribes | Sakshi
Sakshi News home page

టౌన్‌ప్లానింగ్‌ అధికారి సహా ఇద్దరు విలేకరుల అరెస్టు 

Nov 16 2019 2:52 AM | Updated on Nov 16 2019 2:52 AM

ACB Arrested GHMC Town Planning Officer And Scribes - Sakshi

ఏసీబీకి పట్టుబడిన నిందితులు

బంజారాహిల్స్‌ : భవన నిర్మాణ యజమానిని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–18 టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారి సిద్ధాంతం మదన్‌రాజుతో పాటు ఓ రెండు పత్రికల విలేకర్లు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్‌గౌడ్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ సిటీ రేంజ్‌–2 డీఎస్పీ ఎస్‌. అచ్చేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లోని మెట్రో స్టేషన్‌ సమీపంలో కేశవరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్‌లు ఆయన వద్దకు వెళ్లి ఇది అక్రమ నిర్మాణమంటూ బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే సెక్షన్‌ అధికారి మదన్‌రాజుకు చెప్పి కూల్చివేయిస్తామంటూ హెచ్చరించారు.

ఈ క్రమంలో మదన్‌రాజును కూడా వెంటబెట్టుకొని నిర్మాణ స్థలానికి వెళ్లి.. కేశవరెడ్డిని వారు డబ్బులు డిమాండ్‌ చేశారు.దీంతో తాను రూ. 2 లక్షలు ఇచ్చేందుకు ఆయన వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. అప్పటికే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో కేశవరెడ్డి సెక్షన్‌ అధికారితో పాటు ఇద్దరు విలేకరులను ఇంటికి పిలిపించాడు. అక్కడ అతను రూ. 2లక్షలు ఈ ముగ్గురికీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ చేపట్టి ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. సెక్షన్‌ అధికారి మదన్‌రాజు, ఈ ఇద్దరు విలేకరులను కొంత కాలంగా తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడని వారితోనే డబ్బులు వసూ లు చేయిస్తున్నాడని అధికారులు తెలిపారు.  ఇది లా ఉండగా ఈ ఇద్దరు విలేకరులు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement