కొత్తపల్లి కన్నీటిసంద్రం

9 Died In Kottapalli Road Accident In Khammam - Sakshi

ప్రతి రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని జీర్ణించుకోలేని భార్య.. అమ్మా..నాన్న ఇక రాడా? అని పదేపదే అమాయకంగా అడిగే పిల్లలు.. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రులు.. సాయంత్రం వేళావీధి చివర్లో అక్కా.. చెల్లె..అన్న..అని పలకరించుకున్న వారు ఇక లేరని..ఇక రారనే నిజాన్ని నమ్మలేని బంధుమిత్రులు.. ఇలా అందరూ తమతమ వాళ్లను గుర్తు చేసుకుని బాధను దిగమింగుకుని జీవచ్ఛవాలుగా మారిన పరిస్థితి సోమవారం కొత్తపల్లి, గోగ్యనాయక్‌తండాలో కనిపించింది. ప్రస్తుతం ఆ గ్రామాలను నిశ్శబ్దం కాటేస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావుడప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేంత బాధ.. కళ్లలో కన్నీళ్లు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 మంది మృత్యుఒడిలోకి జారుకోవడం ఆ పల్లెల్లో పెను విషాదాన్నే నింపింది.

పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఉదయం 11.30గంటలకు గ్రామానికి చేరుకున్న మృతదేహాలను చూసి.. అంత వరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్ల రూపంలో ఎగసిపడింది. దు:ఖాన్ని దిగమింగుకుని నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా గొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. తమవారిని కడసారి చూపు కోసం బంధువులు, మిత్రులు తరలివచ్చారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయకులు, అధికారులు కొత్తపల్లికి చేరుకున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం మొత్తం కన్నీటి సంద్రంగా మారింది.                                            

సాక్షి, మహబూబ్‌నగర్‌(కొత్తపల్లి) : అమ్మా.. నాన్నా.. మీరిద్దరూ వెళ్లిపోయారు.. మాకు ఇప్పుడు దిక్కెవరు.. అంటూ శివాజీ, చాందీ దంపతుల పిల్లలు గుండెలవిసేలా రోదించారు.. గతంలోనే నాన్నను కోల్పోయాం.. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా.. అంటూ పార్వతమ్మ కూతురు, కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు.. భర్తను మృత్యువు కబళించగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. ఇదీ సుక్రు కుటుంబ పరిస్థితి.. సొంత అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృత్యుఒడికి చేరుకున్నారు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ.. అందరివీ నిరుపేద కుటుంబాలే.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. అలాంటి వారి కుటుంబాలను రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు చిన్నాభిన్నం చేసింది.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి గాధలే వినిపించాయి.. మృతుల కుటుంబ పరిస్థితులను చూసిన వారంతా చలించిపోతున్నారు. 

కూలి పనులు చేస్తూ..
కోడలు అరుణమ్మ కొన్నేళ్ల్ల క్రితం మృతి చెందడంతో వారి పిల్లలు కార్తిక్, జ్యోతిలకు నానమ్మ వడ్డె చెన్నమ్మ పెద్దదిక్కుగా మారింది. అయితే ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నమ్మ సైతం మృత్యువాత పడటంతో వీరి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. చెన్నమ్మ భర్త నర్సయ్య కూడా గతంలో మరణించాడు. దీంతో మనవడు, మనుమరాలుకు పెద్దదిక్కుగా ఉంటూ వారి పోషణ కోసం కూలీ పనులు చేస్తుండేంది.

అనాథలుగా మారిన పిల్లలు

గోగ్యతండాకు చెందిన భార్యాభర్తలు శివాజీ, చాందిలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీంతో వారి పిల్లలు అనూష, సరిత, సంతోష్‌లు అనాథలుగా మిగిలారు. సోమవారం తమ ఇంటికి విగతజీవులుగా వచ్చిన తల్లిదండ్రులను చూసిన పిల్లలు లబోదిబోమంటూ మృతదేహాలపై పడి రోదించారు. ఈ క్రమంలో చిన్నకుతూరు సరిత సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే కారులో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. వీరికి చిన్న ఇల్లు ఉండగా అంతంత మాత్రమే భూమి ఉన్నట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయం లేక భార్యాభర్తలు ఇద్దరు కూలీ పనులకు వెళ్తుంటారు. అదే క్రమంలో ఆదివారం కూడా వరినాట్లు వేసేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకోవడంతో పిల్లలుదిక్కులేని వారయ్యారు.

భర్త మృతి.. భార్య ఆస్పత్రిలో
భర్త అంత్యక్రియలకు కూడా భార్య హాజరుకాలేని అత్యంత విషాదకర ఘటన గోగ్యతండాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండాకు చెందిన సక్రునాయక్‌ మృతి చెందగా అతని భార్య దేవి తీవ్ర గాయాలతో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సోమవారం జరిగిన సక్రు అంత్యక్రియలకు దేవి హాజరుకాలేకపోయింది. సక్రు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో వారి పిల్లలు గోగ్య, శ్రీవాణి, శివతోపాటు అతని ముసలి తల్లిదండ్రులు చావిలీ, గోబ్రియాలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి కుటుంబ పోషణ మరీ దయనీయంగా మారింది. సొంత భూమి లేకపోవడంతో వాడ్యాల్‌ శివారులో కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సక్రు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

సొంత అక్కాచెల్లెళ్లు..

కొత్తపల్లికి చెందిన నెల్లికంటి చంద్రమ్మ, ముదిగొండ వెంకటమ్మలు సొంత అక్కాచెల్లెళ్లు. వారి తల్లి  చంద్రమ్మ తన కూతుళ్లు తన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో కొత్తపల్లికి చెందిన వారితోనే వివాహం జరిపించింది. వీరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. మృతిచెందిన వెంకటమ్మకు భర్త లక్ష్మయ్య, కూతుళ్లు శివలీల, రాణి, కుమారుడు శ్రీను ఉన్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అదేవిధంగా చంద్రమ్మ భర్త నర్సింహులు కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోగా.. పిల్లలు రాఘవేందర్, రమేష్, సుజాతలు ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న తల్లికూడా చనిపోడవంతో ఒంటరి వారయ్యారు. వీరికి చిన్న ఇల్లు తప్ప భూమి తదితర ఎలాంటి ఆధారం లేదని బంధువులు తెలిపారు. 

తల్లి మృతితో తల్లడిల్లిన పిల్లలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండారి ఎల్లమ్మకు ఆరుమంది ఆడపిల్లలే సంతానం. ముగ్గురి కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించగా మరో ముగ్గురు కూతుళ్లు సునీత, లావణ్య, రాణి ఉన్నారు. ఎల్లమ్మ భర్త బొందయ్య కూడా దివ్యాంగుడు  కావడంతో వెంకటమ్మనే కుటుంబ భారాన్ని మోస్తుంది. ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లి కూలీ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. రాణి, లావణ్య కవల పిల్లలు. వీరు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుండగా సునీత ఇంటర్‌ చదువుతుంది. తల్లి మృతితో వీరి చదువులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

పోషించే అమ్మ దూరమైంది
బొంకూరు పార్వతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి పిల్లలు శ్రీలత, శ్రీకాంత్‌లు ఒంటరి వారయ్యారు. తండ్రి చెన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందగా.. తల్లి పార్వతమ్మ అన్నీతానై తన పిల్లలను కూలీ పనిచేసి చదివిస్తూ పోషిస్తుంది. ఈ క్రమంలో కూలీ పనులు ముగించుకొని తిరిగి వస్తూ మృతుఒడికి చేరడంతో ఆ పిల్లలు దిక్కులేనివారయ్యారు .శ్రీకాంత్‌ ఇంటర్‌ చదువుతుండగా, శ్రీలత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరికి కేవలం ఒక చిన్న గదితోపాటు గుడిసె మాత్రమే ఉంది. వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదని బంధువులు చెప్పారు.

కూలి పనే ఆధారం
కొత్తపల్లికి చెందిన బోలేపోగు వెంకటమ్మది ధీనస్థితి. వెంకటమ్మకు భర్త జంగయ్యతోపాటు కూతురు శైలజ ఉంది. వీరికి ఉండడానికి రెండు చిన్నగదుల ఇల్లు మాత్రమే ఉండగా.. దాదాపు ఎకరం గైరాన్‌ భూమి ఉంది. కూలీ పనే ప్రధాన జీవనాధారంగా కుటుంబం గడుస్తుంది. వెంకటమ్మ మృతితో కుటుంబం దయనీయ స్థితికి చేరుకుంది. 

తేరుకోలేకపోతున్నాం.. 
కొత్తపల్లిలో తొమ్మిది మంది, అలాగే గోగ్యతండాలో నలుగురు మొత్తం 13 మంది ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మా గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంకా ఈ సంఘటన నుంచి గ్రామస్తులు తెరుకోలేకపోతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకం. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. 
– దేవేందర్, సర్పంచ్, కొత్తపల్లి 

ఈ ఘటన కలచివేసింది.. 
గ్రామంలో 13 మంది ఒకేసారి మృతి చెందడం పట్ల గ్రామంలోని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా మృతుల అంత్యక్రియలకు ఎంతో సహకరించారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరం. ఈ ఘటన మొత్తం గ్రామస్తులను కలచివేసింది. 
– బాలయ్య, కొత్తపల్లి 

విషాదం అలుముకుంది.. 
గ్రామంలో ఒకేసారి 13 మంది మృతి చెందడం ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటన గ్రామంలో ఎప్పుడూ జరగలేదు. ప్రతి కులంలో ఒకరు మృతిచెందడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దేవుడు బాధిత కుటుంబాలకు త్వరగా విషాదం నుంచి బయటపడేలా చూడాలి. 
– సుదర్శన్‌రెడ్డి, కొత్తపల్లి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top