టూరిస్టు వీసాలిచ్చి మోసగిస్తున్న ముఠా అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి మోసగిస్తున్న, దుబాయ్‌ పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నముఠాలోని కొందరు సభ్యులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌బి నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్‌ భగవత్‌ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్‌, మస్కట్‌, బహ్రెయిన్‌, కువైట్‌ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరక్షరాస్యులైన అమాయక ప్రజలకు టూరిస్ట్‌ వీసాలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. అలాగే దుబాయ్‌కు పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచార గృహాలకు తరలించి డబ్బులు దండుకుంటున్నదని కూడా తెలిపారు. 12మంది సభ్యుల ఈ ముఠాలో ఐదుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారినుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా డాక్యుమెంట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ కేసు విషయంలో బాధితులు పిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఘట్‌కేసర్ ఎస్ఐ శోభన్‌బాబును 15 రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ, సిఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top