30 మంది జలసమాధి | Sakshi
Sakshi News home page

30 మంది జలసమాధి

Published Sun, Nov 25 2018 4:25 AM

30 passengers killed as bus plunges into canal in Mandya - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండ్య జిల్లాలో శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు నీటి కెనాల్‌లో పడింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతిచెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు కాబట్టి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బెంగళూరుకు సుమారు 105 కి.మీ దూరంలోని పాండవపుర తాలూకా కానగానమారండి వద్ద మధ్యాహ్నం బస్సు అదుపు తప్పి 12 అడుగుల లోతున్న వీసీ కెనాల్‌లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీటి నుంచి 30 మృతదేహాల్ని వెలికితీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మృతుల్లో 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని వాదెసముద్ర గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. పిల్లలు స్కూలు ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్‌ సాయంతో బస్సును బయటికి లాగారు. సంఘటనా స్థలం వద్ద భారీగా గుమికూడిన స్థానికులను నియంత్రించడం పోలీసులకు కష్టమైంది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విలపించిన ముఖ్యమంత్రి  
ఈ ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దుచేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటన జరిగిన తీరు తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.  

పరారీలో డ్రైవర్‌.. కేసు నమోదు  
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్‌ పరారయ్యారు. ఈ దుర్ఘటనకు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని పాండవపుర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ప్రమాదానికి గురైన బస్సు మండ్యకు చెందిన  శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరు మీద 2001లో రిజిస్టరై ఉంది. 2019 వరకు బస్సుకు బీమా సదుపాయం ఉంది. బస్సు 15 ఏళ్లకు పైబడినదే కాకుండా, ఇప్పటి వరకు 8 మంది యజమానులు మారినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానిక ఆర్డీవోను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

ఈత రావడం వల్లే బతికా..
అదృష్టం కలసిరావడంతో పాటు ఈత నేర్చుకోవడం వల్లే బతికిపోయానని గిరీశ్‌ అనే ప్రయాణికుడు తెలిపాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు కాలువలో పడి ఉండొచ్చని తెలిపాడు. తన గ్రామానికి చెందిన 15 మంది ఈ ప్రమాదంలో మరణించారన్నాడు. రోహిత్‌ అనే విద్యార్థిని గిరీశ్‌ కాపాడినట్లు తెలిసింది.


కాలువలో పడిపోయిన బస్సును పైకి లాగుతున్న సహాయక సిబ్బంది


కన్నీటిపర్యంతమైన సీఎం కుమారస్వామి

Advertisement
Advertisement