విప్రో లాభం 35% జూమ్‌

Wipro Gain Increased To 35% - Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ. 2,553 కోట్లు

ఆదాయం రూ. 15,875 కోట్లు

క్యూ3లో 2.8 శాతం ఆదాయ వృద్ధి అంచనా...

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం 35% ఎగిసింది. రూ. 2,553 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం రూ.1,889 కోట్లు. మరోవైపు, సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మొత్తం ఆదాయం రూ.15,203 కోట్ల నుంచి రూ.15,875 కోట్లకు పెరిగింది.

మూడో క్వార్టర్‌లో 2,106 మిలియన్‌ డాలర్ల అంచనా.. 
సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన డిసెంబర్‌ త్రైమాసికానికి ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి 0.8–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో గైడెన్స్‌ ప్రకటించింది. ఈ విభాగం నుంచి 2,065–2,106 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగలదని భావిస్తున్నట్లు వివరించింది. రెండో త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయం 2,049 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఇది 2.5 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ పేర్కొంది. ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్‌ 18.1 శాతం పెరిగింది.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32.31 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు విప్రో తెలిపింది. ఇందుకోసం రూ. 10,500 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. మరోవైపు, 5జీ టెలికం సేవలు అందించడానికి సంబంధించి ఆపరేటర్లు, ఇతరత్రా కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు విప్రోతో చేతులు కలిపినట్లు టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. ఆపరేటర్లు తమ పెట్టుబడులపై గరిష్ట ప్రయోజనాలు పొందేలా తోడ్పడేందుకు 5జీ వినియోగాలపై తమ బెంగళూరు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ‘వృద్ధి సాధనకు ప్రాధాన్యమివ్వడం కొనసాగుతుంది. భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడులు కొనసాగుతాయి. షేర్ల బైబ్యాక్‌ సెప్టెంబర్‌లో పూర్తయ్యింది. ఇన్వెస్టర్ల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది‘ అని విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జతిన్‌ దలాల్‌ తెలిపారు.

మరిన్ని విశేషాలు.. 
►సీక్వెన్షియల్‌గా చూస్తే డిజిటల్‌ విభాగం ఆదాయం ఏడు శాతం, వార్షికంగా 29 శాతం మేర వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39.6 శాతంగా ఉంది.  
►క్యూ2లో కొత్తగా 57 సంస్థలు క్లయింట్లుగా జతయ్యాయి. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,027కి చేరింది.  
►ఐటీ సేవల విభాగంలో సీక్వెన్షియల్‌గా 6,603 మంది టెకీలు చేరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 1,81,453కి చేరింది. 
విప్రో షేరు మంగళవారం బీఎస్‌ఈలో స్వల్పంగా పెరిగి రూ. 243.70 వద్ద క్లోజయ్యింది.

ఆదాయాలు, మార్జిన్లపరంగా రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన మొత్తం 7 విభాగాల్లో 6 విభాగాలు వృద్ధి నమోదు చేయగలిగాయి. కొన్ని రంగాల్లో అనిశ్చితి ప్రభావాలు కొనసాగుతున్నప్పటికీ ఐటీ సేవలకు డిమాండ్‌లో పెద్దగా మార్పు లేదు. కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంత దేశాలతో పాటు కీలకమైన అమెరికా, బ్రిటన్‌ మార్కెట్లలో కూడా డీల్స్‌ దక్కించుకోగలుగుతున్నాం. అంతర్జాతీయంగా అందిస్తున్న సేవలు భారతీయ కస్టమర్లకు అందించే వ్యూహాల్లో భాగంగా భారత్‌లో ఒక క్లయింఊట్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నాం. క్యూ1 తో పోలిస్తే క్యూ2లో ఆర్డర్‌ బుక్‌ మరింత మెరుగుపడింది. భారత్, మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఐసీఐసీఐ వంటి కొన్ని డీల్స్‌ ఇలాంటి వ్యూహాల్లో భాగమే.
– అబిదాలి నీముచ్‌వాలా, విప్రో సీఈఓ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top