విప్రో బైబ్యాక్‌ బొనాంజా

Wipro employee accounts may have been hacked, investigation on - Sakshi

షేరుకు రూ.325 ధర... రూ.10,500 కోట్ల విలువ

32.3 కోట్ల షేర్లు తిరిగి కొనుగోలు

నాలుగేళ్లలో ఇది మూడో బైబ్యాక్‌ 

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో మరోసారి ఇన్వెస్టర్లకు తీపి కబురు చెప్పింది. భారీస్థాయిలో రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కంపెనీ మంగళవారం మార్చి క్వార్టర్‌(క్యూ4) ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా షేరుకు రూ.325 ధర చొప్పున 32.3 కోట్ల షేర్లను తమ వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కంపెనీ మొత్తం పెయిడ్‌–అప్‌ ఈక్విటీలో ఇది 5.35 శాతానికి సమానం.సెబీ నిబంధనల ప్రకారం టెండర్‌ ఆఫర్‌ రూపంలో ప్రస్తుత వాటాదారుల నుంచి ఈ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు విప్రో ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీ కూడా బైబ్యాక్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. కాగా, తాజా బైబ్యాక్‌ ధర విప్రో షేరు మంగళవారం నాటి మార్కెట్‌ ముగింపు ధర రూ.281తో పోలిస్తే దాదాపు 16 శాతం అధికం కావడం గమనార్హం. 

15 నెలల్లో రెండోది... 
గడిచిన 15 నెలల్లో ఇది విప్రో ప్రకటించిన రెండో షేర్ల బైబ్యాక్‌. 2017 నవంబర్‌–డిసెంబర్‌లో విప్రో రూ.11,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఇక గడిచిన నాలుగేళ్ల కాలాన్ని తీసుకుంటే విప్రో చేపట్టిన మూడో బైబ్యాక్‌ ఇది. 2016లో తొలిసారి విప్రో రూ. 2,500 కోట్ల బైబ్యాక్‌ను  ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం వాటా ఉంది. 6.49 శాతం వాటా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ చేతిలో ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల వద్ద 11.74 శాతం వాటా, ప్రజలు, కార్పొరేట్లు, ఇతరత్రా ఇన్వెస్టర్ల వద్ద 7.92 శాతం వాటా ఉంది. తాజా బైబ్యాక్‌ ఆఫర్‌ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి చేపడతామని... పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాటాదారుల ఆమోదం తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. బైబ్యాక్‌    ప్రక్రియ, కాల వ్యవధి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. 

ఐటీ కంపెల బైబ్యాక్‌ రూటు... 
భారీ మొత్తంలో ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచేందుకు ఇటీవల కాలంలో దేశీ ఐటీ కంపెనీలు వరుసపెట్టి బైబ్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌ ఏకంగా రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ రూపంలో కొనుగోలు చేసింది. రెండో అతిపెద్ద దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ కూడా 2017 డిసెంబర్‌లో రూ.13,000 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించగా.. మళ్లీ ఈ ఏడాది జనవరిలో రూ.8,260 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌ను చేపట్టింది. ఇంకా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్,        ఎంఫసిస్‌ ఇతరత్రా ఐటీ కంపెనీలు కూడా బైబ్యాక్‌లు, ప్రత్యేక డివిడెండ్‌ల రూపంలో ఇన్వెసర్లకు మంచి రాబడులనే అందించాయి. కాగా, ఎల్‌అండ్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న మైండ్‌ట్రీ కూడా ప్రత్యేక డివిడెండ్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) పరంగా టాప్‌–5 దేశీ ఐటీ కంపెనీలు  2017 జనవరి నుంచి 2019 జనవరి మధ్య కాలంలో ఏకంగా రూ.1.17 లక్షల కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్‌ల రూపంలో ఇన్వెస్టర్లకు చెల్లించాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే    షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్‌ కారణంగా కంపెనీ షేరువారీ   ఆర్జన (ఈపీఎస్‌) మెరుగుపడుతుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top