వేల్యూ ఇన్వెస్టింగ్‌ ప్రాధాన్యం అయితే... 

While the value of investing is important - Sakshi

పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ వేల్యూ ఫండ్‌

ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో పేరొందిన పలు ఫండ్స్‌ కూడా రాబడుల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. కానీ, కొన్ని ఫండ్స్‌ మాత్రం ప్రతికూలతలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డాయి. వాటిలో పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ వేల్యూ ఫండ్‌ కూడా ఒకటి. ఈ పథకం ఏడాది రాబడులను పరిశీలిస్తే బెంచ్‌ మార్క్‌ (నిఫ్టీ 500) కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మల్టీ క్యాప్‌ కేటగిరీ రాబడులతో పోలిస్తే సగటున ఐదు శాతం అధికం కావడం ఈ పథకం పనితీరుకు నిదర్శనాలు. ఈ పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటున 19.5 శాతం రాబడులు ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో ఈ పథకం అగ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని కూడా చేర్చే అంశాన్ని పరిశీలించొచ్చు. 

పెట్టుబడుల విధానం 
పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ వేల్యూ ఫండ్‌ పేరులో ఉన్నట్టు వేల్యూ ఇన్వెస్టింగ్‌ సూత్రాన్ని పాటిస్తుంది. బుల్‌ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని స్టాక్స్, విలువ పరంగా ఆకర్షణీయ స్థాయిల్లో ఉన్న వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంది. బుల్స్‌ పరుగు నిదానించాక, ఈ స్టాక్స్‌ సత్తా చూపించే విధంగా ఉంటాయి. నాణ్యమైన స్టాక్స్‌ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం మేనేజర్లు పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకుంటారు. బాటమ్‌ అప్, కొనుగోలు చేసిన తర్వాత వేచి ఉండే విధానాన్ని అనుసరిస్తారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ పథకం నగదు నిల్వలను, ఆర్బిట్రేజ్‌ పొజిషన్లను పెంచుకుంది. 2016 డిసెంబర్‌ నాటికి 9 శాతంగా ఉంటే, 2018 జూన్‌ నాటికి 24 శాతానికి పెంచుకోవడం జరిగింది. దేశీయ స్మాల్‌ స్టాక్స్‌లోనూ ఎక్స్‌పోజర్‌ను 20 శాతానికి తగ్గించుకుంది. ఏడాదిన్నర క్రితం ఇది 30 శాతం స్థాయిలో ఉంది. దీంతో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ భారీ నష్టాలను చవిచూసిన తాజా మార్కెట్‌ కరెక్షన్‌లో ఈ పథకం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని ఎంఫసిస్, మహారాష్ట్ర స్కూటర్స్‌ బాగా పెరిగాయి. ఈ పథకం తన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు అంతర్జాతీయ బ్లూచిప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు 28 శాతంగా ఉన్నాయి. 

రాబడులు 
ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మరి ఇదే కాలంలో బెంచ్‌ మార్క్‌ రాబడులు 7.9 శాతమే కావడం గమనార్హం. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉండగా, బెంచ్‌ మార్క్‌ రాబడులు 10.2 శాతం. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం అయితే, బెంచ్‌ మార్క్‌ రాబడులు 16.1 శాతంగా ఉన్నాయి. వైవిధ్యం: అంతర్జాతీయంగా బ్లూచిప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లో ఈ పథకం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మొత్తం పథకం నిధుల్లో 10% ఆల్ఫాబెట్‌లోనే ఉన్నాయి. తర్వాత ఫేస్‌బుక్‌లో 5% ఇన్వెస్ట్‌ చేసింది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ ఈ పథకం కనీసం 65% పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top