ఐఫోన్‌ దిగ్గజానికి ప్రశ్నల వర్షం

US House Republicans want answers on Apple throttling older iPhone speeds - Sakshi

పాత ఐఫోన్లను కావాలనే స్లో చేయడంపై టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు, అమెరికా హౌజ్‌ రిపబ్లికన్ల ప్రశ్నలు సంధిస్తున్నారు. పాత ఐఫోన్లు స్లో చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఆపిల్‌ ఇంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీచేసిన వారిలో ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీ చైర్మన్‌తో పాటు నలుగురు అమెరికా హౌజ్‌ రిపబ్లికన్లు ఉన్నారు. ఈ విషయంపై గత డిసెంబర్‌ 28నే ఆపిల్‌ క్షమాపణ చెప్పింది. అంతేకాక బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ వ్యయాలను తగ్గించింది. సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేపట్టింది. దీంతో తమ ఫోన్‌ బ్యాటరీ మంచిగా ఉందో లేదో తెలుసుకోవచ్చని పేర్కొంది.  అంతేకాక ఐఫోన్ల బ్యాటరీ ఓవర్‌హీట్‌ అయి పేలిపోతున్నాయని, దీనికి కూడా వివరణ ఇవ్వాలని ఆపిల్‌కు వారు పంపిన లేఖలో పేర్కొన్నారు. గతవారం జరిగిన ఐఫోన్‌ బ్యాటరీ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి గాయపడిన సంగతి తెలిసిందే.

ఫోన్‌ నుంచి బ్యాటరీని తొలగిస్తున్న క్రమంలో జురిచ్‌లోని ఆపిల్‌ స్టోర్‌లో రిఫైర్‌ వర్కర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. తక్కువ ధరకు బ్యాటరీను రీప్లేస్‌ చేయకుండా ఆపిల్‌ ఈ పన్నాగానికి పాల్పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్‌ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్‌ డివైజ్‌లను స్లో చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్‌ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో లీగల్‌ ఫిర్యాదు కూడా దాఖలైంది. ఫిర్యాదుదారులు మిలియన్‌ డాలర్లను పరిహారంగా కూడా కోరుతున్నారు. ఇజ్రాయిల్‌ ఇదే సమస్యపై సుమారు 120 మిలియన్‌ డాలర్లకు ఓ దావా దాఖలైంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top