యూజర్లందరికీ ట్విటర్‌ బ్లూ టిక్‌

Twitter Looks to Expand Blue Tick Verification to More Users - Sakshi

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్విటర్‌ ఎంతో ప్రాముఖ్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్నైనా ఇటీవల అధికారికంగా ప్రకటించడానికి ట్విటర్‌నే ప్రధాన సాధనంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ట్విటర్‌ను ఉపయోగించనంతగా మరోదాన్ని ఉపయోగించరు. ట్విటర్ ద్వారానే విలువైన విషయాలను షేర్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టు ట్విటర్ కూడా వారికి ఆ అకౌంట్ వాళ్లదే అని తెలిసేటట్టుగా వెరిఫికేషన్ టిక్ కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ టిక్‌ను యూజర్లందరకూ ఇస్తోంది. యూజర్ల గుర్తింపును నిర్థారిస్తూ.. ట్విటర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపడుతోంది. గతేడాది రద్దు చేసిన ఈ ప్రక్రియను, ఇప్పుడు మళ్లీ చేపడుతున్నట్టు తెలిపింది. 

తొలుత ఈ బ్లూ టిక్ ఉండటాన్ని.. కొందరు స్టేటస్‌ సింబల్‌గా భావించేవారు. కానీ ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్‌ను ఇక అందరికీ ఇస్తోంది. సంబంధిత వినియోగదారుని అకౌంట్ అతనిదే అని ధ్రువీకరిస్తూ ఈ బ్లూ టిక్‌ మార్క్‌ ఇస్తారు. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సర్వీసులు అందించే దానిలో తాము ఒకరిగా ఉండాలనుకుంటున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ఫేస్‌బుక్ ప్రొఫైల్, ఫోన్ నంబర్ వంటివి ఏమైనా అందించాలా అన్న విషయాలేవి ట్విటర్‌ తెలుపలేదు. 

2009లో తొలుత ఈ వెరిఫికేషన్ కోడ్ ప్రక్రియను ట్విటర్‌ చేపట్టింది. తొలినాళ్లలో సినిమా వాళ్లకు, క్రీడాకారులకు, వీఐపీలకు మాత్రమే ఈ టిక్‌ మార్క్‌ ఇచ్చింది. ఆ తర్వాత జర్నలిస్టులకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. అయితే గతేడాది కొత్త దరఖాస్తుదారులకు ఈ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ను ఇవ్వడాన్ని ట్విటర్‌ రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించింది. ప్రస్తుతం సామాన్యులకు కూడా ఈ టిక్‌ మార్కును అందిస్తోంది. సామాన్యులకు కూడా ఈ టిక్‌ మార్కును అందించడంతో, ఫేక్ అకౌంట్స్ కట్టడయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top