టీవీ రేట్లకు రెక్కలు..!!

TV prices may rise up to 10persant from March - Sakshi

10 శాతం దాకా పెరగనున్న ధరలు

మార్చి నుంచే అమల్లోకి కరోనా దెబ్బతో ప్యానళ్ల కొరతే కారణం

న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్‌ సెల్‌ టెలివిజన్‌ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్‌ రేటులో దాదాపు 60 శాతం భాగం టీవీ ప్యానళ్లదే ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సెలవులను దృష్టిలో ఉంచుకుని చాలామటుకు కంపెనీలు ముందస్తుగానే వీటిని నిల్వ చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్‌ ప్రబలడం, ఉత్పత్తి.. సరఫరా దెబ్బతినడంతో ప్యానళ్ల కొరత ఏర్పడింది. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకున్నప్పటికీ, అర కొర సిబ్బందితోనే పనిచేస్తున్నాయి.

దీంతో ప్యానళ్ల ధరలు దాదాపు 20 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ‘చైనాలో కరోనా వైరస్‌ సంక్షోభం వల్ల ముడిసరుకులకు భారీ కొరత నెలకొంది. ఓపెన్‌ సెల్‌ ప్యానళ్ళ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. దీంతో మార్చి నాటికి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి‘ అని ఎస్‌పీపీఎల్‌ సీఈవో అవ్‌నీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. భారత్‌లో థామ్సన్‌ టీవీలకు ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ లైసెన్సీగా వ్యవహరిస్తోంది. టీవీ ప్యానళ్ల కొరత కారణంగా టీవీల రేట్లూ పెరగవచ్చని పానాసోనిక్‌ ఇండియా సీఈవో మనీష్‌ శర్మ తెలిపారు. ‘పరిస్థితి మెరుగుపడితే ఏప్రిల్‌ నుంచి రేట్లు స్థిరంగానైనా ఉండవచ్చు లేదా ఇదే ధోరణి కొనసాగితే 3–5% దాకా పెరగవచ్చు‘ అని చెప్పారు.  

ఫ్రిజ్‌లు.. ఏసీలు కూడా..
రాబోయే వారాల్లో ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు కూడా పెరుగుతాయని హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా చెప్పారు. ‘మార్చి ప్రారంభం నుంచి టీవీల రేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ఫ్రిజ్‌లు, ఏసీల ధరలూ పెరుగుతాయి. డీప్‌ ఫ్రీజర్ల రేట్లు ఇప్పటికే 2.5 శాతం పెరిగాయి‘ అని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెసర్లను ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.  

మరో 3 నెలల్లో సాధారణ స్థాయికి...
ఉత్పత్తి, సరఫరా మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే కనీసం ఒక త్రైమాసికమైనా పడుతుందని మార్వా వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాస్ట్‌ అండ్‌ సలివాన్, పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ అధ్యయనం ప్రకారం.. 2018–19లో 1.75 కోట్ల యూనిట్లుగా ఉన్న టీవీ మార్కెట్‌ 2024–25 నాటికి 2.84 కోట్లకు చేరగలదని అంచనా. టీవీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానల్, చిప్స్‌ ప్రధానంగా చైనాతో పాటు తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి మార్కెట్ల నుంచి దిగుమతవుతున్నాయి. భారత్‌లో అసెంబ్లింగ్‌ మాత్రమే జరుగుతోంది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకు, టీవీల ఖరీదును తగ్గించేందుకు ఓపెన్‌ సెల్‌ ప్యానళ్లపై కేంద్రం దిగుమతి సుంకాలను తొలగించిందని నివేదిక వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top