చైనాకు మరోసారి ట్రంప్‌ షాక్‌

Trump To Slap A 25 Percent Tariffs On Chinese Goods - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా విషయంలో అసలు తగ్గేలా కనిపించడం లేదు. ఎలాగైనా వాణిజ్య యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్లేలా చైనాను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించిన ట్రంప్‌, తాజాగా మరోసారి 50 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులతో 25 శాతం టారిఫ్‌లను విధించనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తమ మేథోసంపత్తి ఆస్తులను, టెక్నాలజీని చైనా దొంగలిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్‌ ఈ టారిఫ్‌లను విధించారు. అన్యాయపరమైన వాణిజ్య విధానాలను చైనా అనుసరిస్తుందని ట్రంప్‌ ఆరోపించారు. ఒకవేళ అమెరికా ఉత్పత్తులు, సర్వీసు ఎగుమతులపై కనుక చైనా ప్రతీకారం తీర్చుకుంటే, అదనపు సుంకాలు కూడా ఉంటాయని ట్రంప్‌ హెచ్చరించారు. 

అన్యాయపరమైన ఆర్థిక విధానాల ద్వారా తమ టెక్నాలజీ, మేథోసంపత్తి ఆస్తులను కోల్పోవాల్సి వస్తే, అమెరికా అసలు సహించదని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ చేసిన ఈ ప్రకటనపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. ట్రంప్‌ వార్నింగ్‌లను ఏ మాత్రం లెక్కచేయకుండా.. తాము కూడా ఇదే స్థాయిలో పన్ను చర్యలను వెంటనే ప్రవేశపెడతామని బీజింగ్‌ ప్రకటించింది. ఇరు పార్టీలు అంతకముందు సాధించిన అన్ని ఆర్థిక, వాణిజ్య విజయాలు ఇక వాలిడ్‌లో ఉండవని పేర్కొంది. 34 బిలియన్‌ డాలర్ల విలువైన 818 ఉత్పత్తులపై జూలై 6ను టారిఫ్‌లను విధిస్తామని, మిగతా 16 బిలియన్‌ డాలర్ల విలువైన 284 ఉత్పత్తులపై ప్రజాభిప్రాయాలు, సమీక్షల అనంతరం ఇదే మాదిరి చర్యలు తీసుకుంటామని అమెరికా వాణిజ్య అధికార ప్రతినిధి చెప్పారు. చైనాను కవ్విస్తూ అమెరికా టారిఫ్‌లు విధించడం, అమెరికాకు ప్రతిగా చైనా చర్యలు తీసుకోవడం మరింత వాణిజ్య యుద్ధానికి పురిగొల్పుతోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top