జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊరట: ట్రూజెట్ చేతికి జెట్ విమానాలు

TruJet in talks with Jet Airways to sublease up to 7 ATR planes - Sakshi

సాక్షి,ముంబై:  రుణ సంక్షోభంలో  చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌ వేస్‌  కష్టాలనుంచి గట్టెక్కేందుకు మల్ల గుల్లాలుపడుతోంది. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌కు భారీ ఊరట లభించనుంది. హైదరాబాద్‌ ఆధారిత  సంస్థ  ట్రూజెట్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌తో మంతనాలు జరుపుతోంది. ఈమేరకు  చర్చలు కూడా ప్రారంభించింది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు  ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది.  ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా  ఖర్చులు తగ్గించుకుని  అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ భావిస్తోంది.

7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా స్వల్ప కాల సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నామని  ట్రూజెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉందని అంచనా. మరోవైపు తన అన్ని విమానాల వాడకానికి సంబంధించిన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని జెట్ ఎయిర్వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని సమాచారం.

కాగా జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top