కొత్త కార్లొస్తున్నాయ్‌..!

Three new car models launches in india - Sakshi

బరిలో ఎంజీ, కియా, సిట్రోయెన్‌

మూడేళ్లలో డజను పైగా మోడల్స్‌

మాస్‌ ప్రీమియం విభాగంపైనే దృష్టి

జూన్‌లో ఎంజీ హెక్టార్‌ ఎంట్రీ

న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మరిన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్‌ దిగ్గజాలు కన్నేశాయి. మూడు అంతర్జాతీయ కార్ల కంపెనీలు భారత మార్కెట్లో వాహనాలను ప్రవేశపెట్టబోతున్నాయి. బ్రిటన్‌ సంస్థ ఎంజీ మోటార్, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్, ఫ్రెంచ్‌ దిగ్గజం సిట్రోయెన్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో డజను పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. తద్వారా ఏటా 30 లక్షల పైచిలుకు కార్లు అమ్ముడయ్యే దేశీ ప్యాసింజర్‌ వెహికల్‌ మార్కెట్లో వాటా దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆటోమొబైల్స్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం.. దేశీయంగా యుటిలిటీ వాహనాల మార్కెట్‌ 2013–2018 ఆర్థిక సంవత్సరాల మధ్య 11 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్యాసింజర్‌ కార్ల విభాగం సాధించిన 3 శాతం వృద్ధితో పోలిస్తే యుటులిటీ వాహనాల సెగ్మెంట్‌ వృద్ధి అధిక స్థాయిలో ఉండటం గమనార్హం.

ఎంట్రీ సెగ్మెంట్‌కు దూరం..
కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మూడు సంస్థలు ఎంట్రీ సెగ్మెంట్‌ కార్ల కన్నా అత్యధిక శాతం కస్టమర్లు కొనుగోలు చేసే మాస్‌ ప్రీమియం సెగ్మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు, భద్రత, ఇంధనం ఆదా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలను (ఎస్‌యూవీ) ప్రవేశపెట్టబోతున్నాయి. కాస్త ధర ఎక్కువైనా కొంగొత్త ఫీచర్స్‌ ఉన్న వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటంతో.. గడిచిన అయిదేళ్లలో దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల సగటు ధర సుమారు 6,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లకు చేరిందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఐహెచ్‌ఎస్‌ ఆటోమోటివ్‌ అంచనా వేసింది. దీనికి తగ్గట్లుగానే కొత్త కార్ల రేట్లు ఉండబోతున్నాయి.

ముందుగా ఎంజీ హెక్టార్‌..
అన్ని కంపెనీల కన్నా ముందుగా ఎంజీ మోటార్‌ సంస్థ నుంచి హెక్టార్‌ వాహనం మార్కెట్లోకి రాబోతోంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా ఉండనుంది. హ్యుందాయ్‌ టక్సన్, జీప్‌ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హ్యారియర్‌ వంటి వాహనాలతో ఈ ప్రీమియం ఎస్‌యూవీ పోటీపడనుంది. ఈ ఏడాది జూన్‌లో హెక్టార్‌ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాది చివరి త్రైమాసికంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఎంజీ ప్రవేశపెట్టనుంది. అటుపైన వచ్చే ఐదేళ్లలో ఏటా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా ఈడీ పి. బాలేంద్రన్‌ వెల్లడించారు. ఎంజీ ఇప్పటికే 45 మంది డీలర్లను ఎంపిక చేసింది. వీటికి 110 ఔట్‌లెట్స్‌ నెట్‌వర్క్‌ ఉంటుందని బాలేంద్రన్‌ పేర్కొన్నారు.

కార్ల మార్కెట్‌ కొంత మందగించినా .. ఎస్‌యూవీ విభాగం మాత్రం వృద్ధి నమోదు చేస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఫీచర్స్‌పరంగా, సేవలపరంగా తమ వాహనాలు విభిన్నంగా ఉంటాయని బాలేంద్రన్‌ పేర్కొన్నారు. అటు కియా మోటార్స్‌ ఇండియా కూడా ఎస్‌యూవీ మార్కెట్‌పైనే ఎక్కువగా కసరత్తు చేస్తోంది. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టబోతున్నామని సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ మనోహర్‌ భట్‌ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కియా మోటార్స్‌ తొలి ఎస్‌యూవీని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ఎస్‌పీ2 కోడ్‌నేమ్‌తో వ్యవహరిస్తున్నారు. దీని ధర రూ. 10–16 లక్షల శ్రేణిలో ఉండబోతోంది. హ్యుందాయ్‌ క్రెటా, హోండా హెచ్‌ఆర్‌–వీ తదితర కార్లతో ఇది పోటీపడబోతోంది. సిట్రోయెన్‌ 2021లో తొలి ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆ తర్వాత ఏటా ఒక కొత్త మోడల్‌ను ఆవిష్కరించనుంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top