కియా ఇండియా.. తన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'సోనెట్'ను లాంచ్ చేసినప్పటినుంచి 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 35 శాతం. మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ.. వరుసగా రెండో సంవత్సరం లక్ష యూనిట్ల వార్షిక సేల్స్ సాధించింది.
ప్రీమియం ఫీచర్లు & కనెక్టెడ్ మొబిలిటీ ఎంపికల కారణంగా ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగిందని కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
కియా సోనెట్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో మధ్యప్రాచ్యం & ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా - పసిఫిక్ ప్రాంతాలు ఉన్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష కంటే యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.


