టెస్లా చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌

Tesla has found a new chairperson to replace Elon Musk - Sakshi

సీఈఓగా కొనసాగనున్న ఎలాన్‌ మస్క్‌

వాహింగ్టన్‌: ఎలక్ట్రిక్‌ కార్ల సంచలనం టెస్లా... తన కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌(55)ను నియమించింది. కొన్నాళ్లుగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాబిన్‌ డెన్‌హోమ్‌... ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద టెలికం కంపెనీ, టెల్‌స్ట్రాకు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని టెస్లా తెలిపింది. పబ్లిక్‌ హోల్డింగ్‌ కంపెనీగా అమెరికా స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్లకు షేరుకు 420 డాలర్లు చెల్లిస్తానని, అందుకు తగ్గ నిధులు కూడా ఉన్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న టెస్లా చైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడ్డాడని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్సే్ఛంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభిప్రాయపడింది. దీంతో చైర్మన్‌ పదవికి మస్క్‌ గత నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా ఖాళీ అయిన ఆయన పదవి ఇప్పుడు రాబిన్‌ డెన్‌హోమ్‌తో భర్తీ అయ్యింది. 

నాలుగేళ్లుగా టెస్లా బోర్డులో... 
2014 నుంచి టెస్లా డైరెక్టర్ల బోర్డ్‌లో రాబిన్‌ డెన్‌హోమ్‌ డైరెక్టరుగా ఉన్నారు. ‘‘టెల్‌స్ట్రా సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న ఆమె... 6 నెలల నోటీస్‌ పీరియడ్‌లో ఉన్నారు. ఈ కాలంలో టెస్లా చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతల నిర్వహణకు ఎలాన్‌ మస్క్‌ తగిన సహాయ సహకారాలు అందిస్తారు. టయోటా, సన్‌ మైక్రోసిస్టమ్స్, జునిపర్‌ నెట్‌వర్క్స్‌లో కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. టెక్నాలజీ, వాహన రంగాల్లో అపారమైన అనుభవం ఉంది’’ అని టెస్లా తెలియజేసింది. కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాన్‌కు, టెస్లా టీమ్‌కు తగిన తోడ్పాటునందిస్తానని రాబిన్‌ డెన్‌హోమ్‌ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను అందించడానికి కృషి చేస్తానన్నారు.  

చైర్మన్‌ గిరీని పోగొట్టిన ట్వీట్‌... 
టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు కొనుగోలు చేస్తానని, దానికి తగ్గ నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చేసినప్పుడు టెస్లా షేర్‌ 340 డాలర్ల వద్ద ఉంది. ఈ ట్వీట్‌తో అదేరోజు షేర్‌ ధర 380 డాలర్లపైకి చేరింది. నిజానికిలాంటి ప్రకటనలు ముందుగా ఎక్సే్ఛంజీలకు తెలియజేయాలి తప్ప నేరుగా ప్రకటించకూడదు. ఇది ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడటమేనని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. చివరకు మస్క్‌ వివరణ ఇవ్వటంతో మస్క్, టెస్లా కంపెనీలపై చెరో 2 కోట్ల డాలర్ల జరిమానా వేసింది. సీఈఓగా కొనసాగడానికి ఓకే చేసి... చైర్మన్‌ పదవిని వదులుకోవాలని స్పష్టంచేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top