కరోనా ఎఫెక్ట్‌ : డేటాకు పెరిగిన డిమాండ్‌..

Telecom Service Providers Have Seen Surge In Overall Traffic - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. మొత్తం ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ 10 శాతం పైగా పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా డాంగల్స్‌కూ డిమాండ్‌ రెట్టింపవడంతో రిటైలర్లు స్టాక్‌ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ 10 శాతం పెరిగిందని తమ టెలికాం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మ్యాథ్యూస్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడంతో నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేదని ఆయన తెలిపారు.

డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకాబోవని.. నెట్‌వర్క్స్‌ అన్నీ తగిన సామర్థ్యంతో కూడుకని ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌అప్స్‌కు సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది. రూ 21 టాప్‌అప్‌ చేయిస్తే అంతకుముందు 1 జీబీ స్ధానంలో 2జీబీ డేటా, 200 నిమిషాల ఇంటర్‌నెట్‌ కాల్స్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపచేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్‌ నిరోధించేందుకు ప్రభుత్వ సూచనలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బ్రాడ్‌కాస్టింగ్‌, ఓటీటీ కంపెనీలు కూడా అత్యధిక వ్యూయర్లను, సబ్‌స్ర్కైబర్లను పొందుతున్నాయి.

చదవండి : జనతా కర్ఫ్యూ: ఇటలీ నుంచి 263 మంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top