
హానికారక ఉత్పత్తుల మీద పన్నులపై ఆందోళన అక్కర్లేదు
పొగాకు వంటి హానికారక ఉత్పత్తులు, ఖరీదైన కార్లపై అధిక పన్నుల ప్రతిపాదనలు
జీఎస్‌టీ రేట్లు సరైనవే: సీఈఏ అరవింద్ సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ: పొగాకు వంటి హానికారక ఉత్పత్తులు, ఖరీదైన కార్లపై అధిక పన్నుల ప్రతిపాదనలు సహా మూడంచెల వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం సరైనదేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ సమర్థించారు. ప్రస్తుత పన్నుల విధానాలకు అనుగుణంగానే దీనిపై సిఫార్సులు చేసినట్లు ఆయన వివరించారు.
ఇప్పుడు చాలా మటుకు లగ్జరీ ఉత్పత్తులపై అత్యధిక పన్నుల శ్రేణిలోనే ఉన్నాయని, యథాతథ స్థితిని కొనసాగించేలాగే తమ సిఫార్సులున్నాయన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని సుబ్రమణ్యన్ చెప్పారు. హానికారక ఉత్పత్తులపై అధిక పన్ను (‘సిన్’ ట్యాక్స్) పరిధిలో కేవలం కొన్ని ఉత్పత్తులను కమిటీ ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. వివిధ వస్తువులు, సేవలపై 12-40 శాతం శ్రేణిలో కనిష్ట, గరిష్ట పన్నులను, 17-18 శాతం స్థాయిలో ప్రామాణిక పన్నుల రేట్లను ప్రతిపాదిస్తూ సుబ్రమణ్యన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే.
మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని సాకారం చేసే లక్ష్యంతోనే అంతర్‌రాష్ట్ర స్థాయిలో వస్తువులపై అదనంగా 1 శాతం లెవీని తొలగించాలని ప్రతిపాదించినట్లు సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఇక రాజ్యాంగంలో జీఎస్‌టీ రేటును పొందుపర్చరాదన్న కమిటీ ప్రతిపాదనను సమర్థిస్తూ.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ రాజ్యాంగంలోనూ పన్ను విధానానికి సంబంధించిన అత్యంత సూక్ష్మ వివరాలను కూడా పొందుపర్చడం జరగదని ఆయన చెప్పారు. రాజ్యాంగంలో పొందుపర్చిన పక్షంలో భవిష్యత్‌లో ఎప్పుడైనా రేట్లను మార్చాల్సిన పరిస్థితి తలెత్తితే కష్టమయ్యే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమన్నారు.
సరైన దిశలోనే వెళుతున్నాం: అరవింద్ పనగారియా
భారీ సంస్కరణలను ప్రవేశపెట్టే క్రమంలో జీఎస్‌టీ అమలుపై భారత్ సరైన దిశలోనే వెళుతోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పన్‌గారియా వ్యాఖ్యానించారు.ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్‌ఎంఈ) భారతీయ పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా పనగారియా ఈ విషయాలు తెలిపారు.