ఆదాయ పన్ను ఎగవేతదారులకు జైలు శిక్షలు | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను ఎగవేతదారులకు జైలు శిక్షలు

Published Tue, Sep 13 2016 1:06 AM

ఆదాయ పన్ను ఎగవేతదారులకు జైలు శిక్షలు - Sakshi

హైదరాబాద్: ఆదాయ పన్ను ఎగవేతలకు సంబంధించి వివిధ సంస్థల అధిపతులకు ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం ప్రత్యేక జడ్జి కఠిన కారాగార శిక్షలు, జరిమానాలు విధించారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయనందుకు, నోటీసుల ఉల్లంఘనకు గాను జెనరా అగ్రి కార్ప్ ఎండీ రాజేశ్ నాయుడు మునిరత్నం, డెరైక్టర్ కల్పనా రాజ్ మునిరత్నంలకు ఆర్నెల్ల దాకా కఠిన కారాగార శిక్ష, సంవత్సరానికి రూ. 1,000 చొప్పున ఆరు అసెస్‌మెంట్ ఇయర్స్‌కి పెనాల్టీ విధిం చారు.

ఇక  వసూలు చేసిన టీడీఎస్‌ను ఖజానాకు జమచేయనందుకు గాను సూపర్ బిల్డ్ ఇండియా ఎండీ మీర్ మజర్ అలీకి, నిర్దేశిత పన్ను చెల్లించనందుకు గాను శ్రీనివాస అండ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్ పి. సుబ్బారావుకు రూ. 10,000 జరిమానా, ఆర్నెల్ల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లించకపోవడం అభియోగాలపై విండ్సర్ మోటార్స్ ప్రొప్రైటర్ సయ్యద్ ఖలీల్‌కు రూ. 20,000 దాకా జరిమానా, ఆర్నెల్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. ఏపీ, తెలంగాణ ఆదాయ పన్ను విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా.. ఐటీ రిటర్నులకు సంబంధించి 26, పన్నుల ఎగవేతకు సంబంధించి 7 కేసులు దాఖలు చేసింది.

Advertisement
 
Advertisement