
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కొత్తగా ‘బర్గ్‌మాన్ స్ట్రీట్’ పేరిట స్కూటర్ ను ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ స్కూటర్ ధర రూ. 68,000 (ఎక్స్ షోరూం). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలను 40 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ సతోషి ఉచిడా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో 5 లక్షల వాహనాలు విక్రయించగా.. ఈసారి 7 లక్షల వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
2020 నాటికల్లా అమ్మకాలను 10 లక్షల స్థాయికి పెంచుకోనున్నట్లు సతోషి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ)తో కలిసి పనిచేస్తున్నామని, 2020 నాటికల్లా ఎలక్ట్రిక్ స్కూటర్ తరహా వాహనం ఒకదాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు.