అంబానీకి సుప్రీంకోర్టు ఊరట

Supreme Court Quashes Bombay HC Stay On RComs Asset Sale - Sakshi

న్యూఢిల్లీ : రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆస్తులు విక్రయించకుండా బొంబై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో స్వీడిష్‌ గేర్‌ మేకర్‌ ఎరిక్సన్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చట్ట ప్రకారం ఆర్‌కామ్‌ ఆస్తులను విక్రయించుకోవచ్చని క్రెడిటార్లకు టాప్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్‌కామ్‌ స్పెక్ట్రమ్‌, ఫైబర్‌, రియల్‌ ఎస్టేట్‌, స్విచ్చింగ్‌ నోడ్స్‌ వంటి వాటిని విక్రయించుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్‌కామ్‌ షేర్లు లాభాల జోరు కొనసాగిస్తోంది. ఆర్‌కామ్‌ షేర్లు దాదాపు 2.5 శాతం లాభపడ్డాయి.

మార్చి మొదట్లో తమ ఆస్తులు విక్రయించకుండా ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ విధించిన ఆదేశాలను ఛాలెంజ్‌ చేస్తూ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ బొంబై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. కానీ ఫిర్యాదును హైకోర్టు కొట్టిపారేసి,  ఆర్బిట్రేషన్‌ అనుమతి లేకుండా ఎలాంటి ఆస్తులు విక్రయించకూడదని, ఆస్తుల విక్రయంపై స్టే విధించింది.

ఎరిక్సన్ ఏబీకి చెందిన ఇండియన్‌ విభాగానికి రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విషయమే ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. దీంతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ విక్రయిద్దామన్న ఆస్తులు విక్రయించకుండా.. డీల్స్‌ బదలాయింపులు చేయడానికి వీలులేకుండా కోర్టు  మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆస్తులు విక్రయించుకునే విషయంలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తన ఆస్తులను అన్న ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు అమ్మేసి, ఆ అప్పులను కొంతమేర తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు దాదాపు రూ.45వేల కోట్ల అప్పులున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top