మాల్యాకు సుప్రీం షాక్‌

Supreme Court Asks Centre To Respond To Liquor Baron Vijay Mallyas Petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతకేసులో తనను పరారీలో ఉన్న నేరస్ధుడిగా ఈడీ ప్రకటించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాలను చెల్లించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని,  తనపై విచారణను నిలిపివేయాలని విజయ్‌ మాల్యా ఈ ఏడాది నవంబర్‌ 22న సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరోవైపు తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదని సెప్టెంబర్‌లో మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్ట (పీఎంఎల్‌ఏ) న్యాయస్ధానానికి నివేదించారు. మనీల్యాండరింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. రూ 9000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు మాల్యాపై అభియోగాలు నమోదు చేశాయి. న్యాయస్ధానాలు ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించడంతో లండన్‌లో తలదాచుకున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు వేగవంతం చేసింది.

మాల్యా అప్పగింతపై వచ్చేవారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తాను బ్యాంకు రుణాల అసలు మొత్తం చెల్లించేందుకు సిద్ధమని, తన ప్రతిపాదనను బ్యాంకులు అంగీకరించాలని రెండు రోజుల కిందట మాల్యా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top