ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!! | Suitable for investing in tidal tanks | Sakshi
Sakshi News home page

ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!

Jun 11 2018 2:11 AM | Updated on Jun 11 2018 2:11 AM

Suitable for investing in tidal tanks  - Sakshi

ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి పథకాల కోసం అన్వేషించే వారు ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. మొన్నటి వరకు ఎస్‌బీఐ మాగ్నం బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌గా చెలామణి అయిన ఈ పథకం పేరు సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌గా మారింది. అయితే, పెట్టుబడుల పరంగా పథకం విధానాల్లో పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఈక్విటీల్లో కనీసం 65శాతం పెట్టుబడి పెడుతుంది. అంటే ఇంతకుమించి కూడా సందర్భానుసారంగా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. మిగిలిన పెట్టుబడులను డెట్‌ విభాగంలో ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీల్లో పెడుతుంది. మార్కెట్‌ అస్థిరతల సమయాల్లో ఈ పథకం పనితీరు చెప్పుకోతగిన విధంగా ఉండటం గమనార్హం.

నేర్పుతో కూడిన విధానం
ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో అననుకూల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఈక్విటీల్లో తక్కువ ఎక్స్‌పోజర్‌ కారణంగా 2011, 2015 అస్థిరతల మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. 2014లో బాండ్‌ మార్కెట్‌ ర్యాలీలో అధిక లాభాలను ఒడిసి పట్టుకుంది. ఆ ఏడాది 23 శాతం వరకు పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టింది. అంతకుముందు ఏడాది ఇది 10 శాతంగానే ఉంది. ఇక 2017 ఈక్విటీ మార్కెట్లలో భారీ ర్యాలీ అనంతరం కరెక్షన్‌ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుంది. మిడ్‌క్యాప్స్‌కు 30–35 శాతం వరకు కేటాయింపులు చేయడం ద్వారా 2014 బుల్‌ ర్యాలీలో మంచి పనితీరు కనబరిచింది. అయితే, వీటిలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో 2017 నుంచి ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుంది. డెట్‌ వైపు గతేడాది కాలంలో 10 ఏళ్ల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్‌ 7.7 శాతానికి చేరిన నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకుని షార్ట్‌టర్మ్‌ మనీమార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో ఎక్స్‌పోజర్‌ తీసుకుంది.

రాబడులు ఇలా ఉన్నాయ్‌...
పెట్టుబడుల పరంగా ఈ విధమైన వ్యూహాల కారణంగా ఈ పథకం సదరు కేటగిరీలో మెరుగైన పనితీరు చూపించగలుగుతోంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు కేటగిరీతో పోలిస్తే సగటున 1–5 శాతం అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.8 శాతం, మూడేళ్లలో 9.9 శాతం, ఐదేళ్లలో 16.8 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం అందించింది. 

పోర్ట్‌ఫోలియో:ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 65 శాతం, మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో 13 శాతం, కార్పొరేట్‌ డిబెంచర్లలో 8 శాతం, 11 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో కలిగి ఉంది.  కాలానుగుణంగా ఈక్విటీ హోల్డింగ్స్‌లో మార్పులు చేస్తుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement