
బడ్జెట్‌కు ముందు లాభాల్లోకి ఎగిసిన మార్కెట్లు(ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, ముంబై: మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్-2018 ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభంలోనే 100 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్ 36వేల మార్కును తిరిగి చేధించింది. ప్రస్తుతం 230 పాయింట్ల లాభంలో 36,195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 61 పాయింట్ల లాభంలో 11,088 వద్ద లాభాలు పండిస్తోంది. మోదీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో ఇన్వెస్టర్ల కళ్లన్నీ బడ్జెట్ పైనే ఉన్నాయి.
అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లందరూ అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్ సూచీలు గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రారంభం కావడానికి కాస్త ముందుగా మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమవ్వడం సానుకూల అంశంగా కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, భారీగా హెచ్చు తగ్గులకు గురయ్యే అవకాశం ఉందని మరోవైపు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.