పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు | shares,debt instruments for Investment | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు

Oct 5 2014 12:42 AM | Updated on Sep 2 2017 2:20 PM

పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు

పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు

ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో భారత్‌పై ఆశాభావం, అంచనాలు పెరిగాయి. అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సైతం ఆశలు ఊపందుకున్నాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో భారత్‌పై ఆశాభావం, అంచనాలు పెరిగాయి. అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సైతం ఆశలు ఊపందుకున్నాయి. ఇదే పరిస్థితులు మెరుగుపడేందుకు దోహదపడుతుంది. ఇలాం టప్పుడు పెట్టుబడులపై అధిక రాబడులు అందుకునేందుకు ప్రత్యేక వ్యూహం పాటించాల్సి ఉంటుంది. కంపెనీలు వివిధ వ్యాపారాల్లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తుంటాయో అలాగే ఇన్వెస్టర్లు కూడా రిస్కు సామర్థ్యాన్ని బట్టి వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీలు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలు ఇందుకు ఉపయోగపడగలవు.

ఈక్విటీలు , ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలు..
పోర్ట్‌ఫోలియోలో ఉండదగిన కీలకమైన సాధనాల్లో ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రెండూ కూడా మెరుగైన పనితీరు కనపర్చగలవన్న అంచనాలు నెలకొన్నాయి. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ కంపెనీల ఆదాయాలు మెరుగుపడుతుండటం ఒక కారణం. కాగా, ద్రవ్యోల్బణ కట్టడి చర్యల మూలంగా వడ్డీ రేట్లు దిగి రానుండటం మరో కారణం. ఈక్విటీలు, ఎఫ్‌డీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికి పైన పేర్కొన్న రెండూ బలమైన కారణాలే.
 
దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచడం వల్ల ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో మార్పులు వచ్చాయి. షేర్లలో పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములను ఎంచుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో వీటికి కాస్త ఎక్కువ కేటాయింపులే జరపవచ్చు.

 అసలు ఏ స్కీమును ఎంచుకోవాలన్న విషయంలో ఇన్వెస్టర్లకు చాలా సందర్భాల్లో సందేహాలు ఎదురవుతుంటాయి. ఈ ప్రశ్న మంచిదే అయినప్పటికీ.. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏ సాధనం వృద్ధి కూడా పెరుగుతూనే పోదు. ఒక్కోసారి పెరగొచ్చు.. ఒక్కోసారి తగ్గొచ్చు. కాబట్టి, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ వంటి వివిధ ఈక్విటీ సాధనాలను ఎంచుకోవచ్చు. ఇన్వెస్టర్లకు గరిష్ట లాభాలు అందించే ఉద్దేశంతో వీటిలో ఒక్కొక్కటీ మార్కెట్‌లో ఒక్కో విభాగంపై దృష్టి పెడుతుంటాయి. కనుక, డబ్బు మొత్తాన్ని ఒకే ఫండ్‌లో పెట్టేయకుండా వివిధ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక స్థిరమైన ఆదాయాలను అందించే సాధనాల విషయానికొస్తే.. ఇప్పటి వడ్డీ రేట్లను బట్టి చూస్తే..స్వల్పకాలిక మొదలుకుని మధ్యకాలిక వ్యవధికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీములను ఎంచుకోవచ్చు. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లలో పన్ను పరమైన ప్రయోజనాలను పొందాలంటే ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధిని మూడేళ్లకు పెంచారు. కనుక, లిక్విడ్ ప్లస్, షార్ట్.. మీడియం టర్మ్ ప్లాన్లు, డైనమిక్ ఫండ్స్ వంటి ఓపెన్ ఎండెడ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీముల్లో కేటాయింపులు పెంచవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement