‘మెరుపుదాడి’ నష్టాలు | Sensex loses 499 points in intra day | Sakshi
Sakshi News home page

‘మెరుపుదాడి’ నష్టాలు

Feb 27 2019 12:54 AM | Updated on Feb 27 2019 12:54 AM

Sensex loses 499 points in intra day - Sakshi

పాకిస్తాన్‌ టెర్రరిస్ట్‌ క్యాంప్‌లపై భారత్‌ మెరుపుదాడి చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. దీంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, ముడి చమురు ధరలు పెరగడం, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే మెరుపుదాడిలో పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని, టెర్రరిస్ట్‌లకే భారీగా నష్టం వాటిల్లిందని భారత ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 499 పాయింట్లు పతనమైనప్పటికీ, ఆ తర్వాత కోలుకుంది. చివరకు 240 పాయింట్ల నష్టంతో 35,974 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 151 పాయింట్ల వరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 45 పాయింట్ల నష్టంతో 10,835 పాయింట్ల వద్దకు చేరింది.  బ్యాంక్, రియల్టీ, ప్రభుత్వ రంగ షేర్లు బాగా నష్టపోయాయి. 

దేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు .....
డాలర్‌తో రూపాయి మారకం ఆరంభంలోనే 38 పైసలు తగ్గి 71.35కు పడిపోయింది. చివర్లో కోలుకుంది. మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు తాజాగా అమ్మకాలకు దిగడం సెంటిమెంట్‌ను మరింతగా దెబ్బకొట్టింది. పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి వార్తల కారణంగా మార్కెట్‌ భారీ నష్టాలతో ఆరంభమైంది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకూ నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత నష్టాలు తగ్గాయి. 250 పాయింట్లు రికవరీ అయ్యాయి. 

పదో రోజూ టాటా మోటార్స్‌ పరుగు 
వరుసగా పదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా టాటా సన్స్‌ కంపెనీ టాటా మోటార్స్‌లో వాటాను 1% పెంచుకుందన్న వార్తలతో ఈ షేర్‌ 4% లాభపడి రూ. 183కు చేరింది.  క్యూ3లో  కంపెనీకి భారీ నష్టాలు రావడంతో ఈ నెల 8న  షేర్‌ రూ.142కు పడిపోయింది. 14 ట్రేడింగ్‌ సెషన్లలో 29% లాభపడింది. 

జీ షేర్ల జోష్‌..
మార్కెట్‌ బలహీనంగా ట్రేడైనప్పటికీ, జీ గ్రూప్‌ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 10 శాతం ఎగసి రూ.490ను తాకింది. చివరకు 5 శాతం లాభంతో రూ.469 వద్ద ముగిసింది.  గత నెల 25న ఈ షేర్‌ రూ.289కు పడిపోయింది. అప్పటి నుంచి చూస్తే, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ షేర్‌ 62 శాతం లాభపడింది. మరో గ్రూప్‌ కంపెనీ డిష్‌ టీవీ ఇంట్రాడేలో 6 శాతం ఎగసి రూ.40ను తాకింది. చివరకు ఫ్లాట్‌గా రూ.37.40 వద్ద ముగిసింది. గత నెల 28న రూ.19 ధర వద్ద ఉన్న ఈ షేర్‌ కూడా నెల వ్యవధిలోనే వంద శాతం ఎగసింది. 
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నుంచి హెచ్‌పీసీఎల్‌ను తొలగించి బ్రిటానియా ఇండస్ట్రీస్‌ను చేరుస్తున్నారు. వచ్చే నెల 29 నుంచి ఈ మార్పు చోటు చేసుకుంటుంది. వైదొలుగుతున్న హెచ్‌పీసీఎల్‌ 1 శాతం నష్టంతో రూ.226 కు పడిపోగా, నిఫ్టీలో చేరుతున్న బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ.3,074 వద్ద ముగిసింది. 


►దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్‌ను తగ్గించడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 4 శాతం నష్టపోయి రూ.131 వద్ద ముగిసింది. 
►హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ సెన్సెక్స్‌లో భారీగా 2.2 శాతం నష్టంతో రూ.1,058వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement