4 రోజుల నష్టాలకు బ్రేక్‌

Sensex jumps 1,628 points on economic stimulus hopes - Sakshi

కోవిడ్‌ వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది...

అయినా స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ 

ఉద్దీపనలతో పెరుగుతున్న ప్రపంచ మార్కెట్లు 

మన దగ్గరా ఉద్దీపన చర్యలపై ఆశలు 

షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల జోరు..

ఇది టెక్నికల్‌ ర్యాలీయే అంటున్న నిపుణులు 

1,628 పాయింట్ల లాభంతో 29,916కు సెన్సెక్స్‌

482 పాయింట్లు పెరిగి 8,745కు నిఫ్టీ  

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కల్లోలాన్ని కట్టడి చేయడానికి వివిధ కేంద్ర బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా శుక్రవారం లాభపడింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి ఫైనాన్షియల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్దీపన చర్యలు ఉంటాయనే అంచనాలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి.

గురువారం 75 మార్క్‌ను చేరిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకోవడం కలసి వచ్చింది. మరోవైపు ఇది పూర్తిగా టెక్నికల్‌ ర్యాలీయేనని, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా సాగాయని కొంతమంది నిపుణులంటున్నారు. అయితే ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఒక దశలో 355 పాయింట్లు పతనమై, 2,130 పాయింట్లకు ఎగసిన  సెన్సెక్స్‌ చివరకు 1,628 పాయింట్లు పెరిగి 29,916 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 5.75 శాతం, నిఫ్టీ 5.83 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఆరు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ సూచీలు ఇన్ని పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 4,188 పాయింట్లు, నిఫ్టీ 1,210 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు చెరో 12 శాతం మేర నష్టపోయాయి. సూచీలు వరుసగా ఐదో వారమూ నష్టపోయాయి. ఇక ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల్లోనే  ముగిశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్‌ సూచీలు 7% మేర లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 5% లాభాల్లో ఆరంభమయ్యాయి.  

లాభాల్లో కోవిడ్‌ ఔషధ షేర్లు
కోవిడ్‌–19 చికిత్సలో హైడ్రోక్లోరోక్వినైన్‌ ప్రభావవంతంగా పనిచేస్తోందన్న వార్తల కారణంగా ఈ ఔషధాన్ని తయారు చేసే కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాడిలా హెల్త్‌కేర్‌ 16 శాతం లాభఃతో రూ.285కు, ఇప్కా ల్యాబ్స్‌ 9 శాతం లాభంతో రూ.1,372కు, టొరెంట్‌ ఫార్మా 4 శాతం లాభంతో రూ.1,846కు పెరిగాయి.  
► ఓఎన్‌జీసీ 19 శాతం లాభంతో రూ.72 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. అల్ట్రాటెక్‌ సిమెంట్, 13 శాతం, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 12 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 11 శాతం, టీసీఎస్‌ 10 శాతం, టాటా స్టీల్‌ 10 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 9 శాతం చొప్పున లాభపడ్డాయి.  
► సెన్సెక్స్‌ 30 షేర్లలో రెండు షేర్లు– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి.  
► నిఫ్టీలోని 50 షేర్లలో నాలుగు షేర్లు–హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్,, అదానీ పోర్ట్స్, యాక్సిస్‌ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 46 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
► భారతీ ఇన్‌ఫ్రాటెల్‌  23 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఇదే.  
► రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 11 శాతం లాభంతో రూ.1,020 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.65,358 కోట్లు పెరిగి రూ.6,46,732 కోట్లకు పెరిగింది.

రూ. 6.32 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.6.32 లక్షల కోట్లు ఎగసి రూ.116.1 లక్షల కోట్లకు పెరిగింది.

టెక్నికల్‌ ర్యాలీ.. జాగ్రత్త!
కోవిడ్‌ కల్లోలం తగ్గకపోయినా స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ జరపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ర్యాలీ కొనసాగింపుపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్న నిపుణులు అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. ఫండమెంటల్స్‌ పరంగా ఎలాంటి మార్పుల్లేకపోయినా, కేవలం టెక్నికల్స్‌ కారణంగానే ఈ ర్యాలీ చోటు చేసుకుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. మార్కెట్‌ రికవరీ మొదలైందని భావించి, ఇప్పుడే కొనుగోళ్లకు దిగవద్దనేది నిపుణుల సూచన.

రూపాయి.. కొత్త కనిష్టం
ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజు శుక్రవారం మరో ‘చరిత్రాత్మక’ కనిష్టానికి పడిపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడి 75.20కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి గురువారం తరహాలో నే 75.30ని తాకింది. రూపాయి క్రితం ముగింపు 75.12.  

ఆరు నెలల కనిష్టానికి విదేశీ మారకపు నిల్వలు...
భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో ముగిసిన వారంలో 6 నెలల కనిష్ట స్థాయి 481.89 డాలర్లకు పడిపోయాయి. వారంవారీగా 5.35 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. మార్చి 6తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 487.23 బిలియన్‌ డాలర్లకు చేరాయి.   

షార్ట్‌  సెల్లింగ్‌... ఒకింత కఠినం!
న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులను నివారించేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నడుం బిగించింది. మ్యూచువల్‌ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జరిపే షార్ట్‌ సెల్లింగ్‌పై పరిమితులను విధించడం ద్వారా ఒడిదుడుకులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.  డెరివేటివ్స్‌ సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్‌ వైడ్‌ పొజిషన్ల పరిమితిని సవరించింది. డైనమిక్‌ ప్రైస్‌బాండ్లలో సరళీకరణతో సహా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసింది. సోమవారం (ఈ నెల 23) నుంచి నెల రోజుల పాటు ఈ  మార్పులు, చేర్పులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సెబీ తాజా నిర్ణయాల కారణంగా ఇంట్రాడేలో షార్టింగ్‌ చేసే వారిపై ప్రభావం పడుతుం దని నిపుణులంటున్నారు. ఒడిదుడుకులు ఒకింత తగ్గుతాయని వారంటున్నారు. వివరాలు....

► డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో లేని షేర్లకు క్యాష్‌ మార్కెట్లో మార్జిన్‌ను 40 శాతం వరకూ పెంచింది.  
► ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్‌ వైడ్‌ పొజిషన్‌ లిమిట్‌(ఎమ్‌డబ్ల్యూపీఎల్‌) ప్రస్తుతమున్న స్థాయి నుంచి 50 శాతం మేర తగ్గించింది.  
► ఏదైనా ఒక షేర్‌  ఎమ్‌డబ్ల్యూపీఎల్‌ యుటిలైజేషన్‌ 95 శాతం మేర మించితే, ఈ షేర్‌పై నిషేధం విధిస్తారు.  
► డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లోని షేర్లలో డైనమిక్‌ ప్రైస్‌ బాండ్లలో మార్పులు, చేర్పులు చేసింది.  
► మ్యూచువల్‌ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు,  ట్రేడింగ్‌ మెంబర్స్‌(ప్రోప్రయిటరీ), క్లయింట్లు షార్ట్‌ పొజిషన్లపై పరిమితులు విధించింది.  
► ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ల్లో ఈ సంస్థల షార్ట్‌ పొజిషన్లు, వాటి నోషనల్‌ వేల్యూలో మించకుండా ఉండాలి.  
► నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ఇలాంటి సాధనాల్లో ఈ సంస్థల హోల్డింగ్స్‌ను మించి ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో ఈ సంస్థల లాంగ్‌ పొజిషన్లు ఉండకూడదు.

షార్ట్‌ సెల్లింగ్‌ అంటే....
 షార్ట్‌ సెల్లరు–భవిష్యత్తులో ధర తగ్గుతుందనే అంచనాలతో తమ వద్ద షేర్లు లేకపోయినా, వాటిని ఇతరులకు విక్రయిస్తారు. దీని కోసం కొంత మార్జిన్‌ను స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల వద్ద ఉంచుతారు. వారి అంచనాలకునుగుణంగానే ధర తగ్గగానే ఆ షేర్లను కొనుగోలు దారులకు డెలివరీ చేస్తారు. ధరల తేడా కారణంగా షార్ట్‌ సెల్లర్లు లాభపడతారు. దీంట్లో రిస్క్‌ అధికంగా, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వారి అంచనాలకనుగుణంగానే ధర తగ్గకుండా, పెరిగిపోతే, ఆ మేరకు వారికి భారీగా నష్టాలు వస్తాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top