రికార్డుల్లో హ్యాట్రిక్‌ | Sensex ends at record high of 30,659; Nifty jumps to 9,526 | Sakshi
Sakshi News home page

రికార్డుల్లో హ్యాట్రిక్‌

May 18 2017 2:03 AM | Updated on Oct 1 2018 5:16 PM

రికార్డుల్లో హ్యాట్రిక్‌ - Sakshi

రికార్డుల్లో హ్యాట్రిక్‌

భారత్‌ ప్రధాన స్టాక్‌ సూచీలు వరుసగా మూడోరోజు రికార్డు గరిష్టస్థాయిలో ముగియడం ద్వారా హ్యాట్రిక్‌ సాధించా యి. రుతుపవనాలు త్వరితంగా రావడం,

ముంబై: భారత్‌ ప్రధాన స్టాక్‌ సూచీలు వరుసగా మూడోరోజు రికార్డు గరిష్టస్థాయిలో ముగియడం ద్వారా హ్యాట్రిక్‌ సాధించా యి. రుతుపవనాలు త్వరితంగా రావడం, కార్పొరేట్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండటంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు బుధవారం కూడా కొనసాగింది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో 76 పాయింట్లు ఎగిసి కొత్త చరిత్రాత్మక గరిష్టస్థాయి 30,659 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 470 పాయింట్లు ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అదేబాటలో 13.50 పాయింట్లు పెరిగి 9,526 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా ఎఫ్‌బీఐ చీఫ్‌ను ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా తొలగించడంతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు ప్రతికూలధోరణిలో ట్రేడ్‌అయినా, భారత్‌ మార్కెట్‌ సానుకూలంగా ముగియడం విశేషం.

టాటా స్టీల్‌ టాప్‌....
మంగళవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత టర్న్‌ ఎరౌండ్‌ ఫలితాల్ని ప్రకటించిన టాటా స్టీల్‌ షేరు బుధవారం జోరుగా ర్యాలీ జరిపింది. 8 శాతం ర్యాలీ జరిపిన ఈ షేరు రూ. 493 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌–30 షేర్లలో 17 షేర్లు పెరగ్గా, అత్యధికంగా లాభపడింది టాటా స్టీల్‌ షేరే. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2.5 శాతం మేర పెరిగింది. ర్యాలీ పటిష్టంగా లేదు..:మార్కెట్‌ కొత్త రికార్డుస్థాయిల్ని తాకినప్పటికీ, బుధవారంనాటి ర్యాలీలో పటిష్టత కొరవడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.

అమెరికాలో ఏర్పడిన తాజా అనిశ్చితి ఫలితంగా ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరించారని ఆయన అన్నారు. జీఎస్‌టీ రేట్లపై స్పష్టత ఇచ్చ కౌన్సిల్‌ సమావేశం రెండురోజుల్లో జరగనున్నందున, ఇన్వెస్టర్లు ఆ సమావేశంపై దృష్టి నిలిపారని ఆయన వివరించారు. కార్పొరేట్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు క్రితం రోజు రూ. 858 కోట్లు నికర కొనుగోళ్లు జరిపారు.

ప్రపంచ మార్కెట్లు డౌన్‌..
ఎఫ్‌బీఐ చీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు తొలగించిన నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సంక్షోభం కారణంగా చాలావరకూ ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు క్షీణించాయి. జపాన్‌ నికాయ్, ఆస్ట్రేలియా ఆల్‌ ఆర్డనరీస్, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్, సింగపూర్‌ స్ట్రయిట్‌టైమ్స్, తైవాన్‌ తైపీ సూచీలు 1 శాతం వరకూ నష్టపోయాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్‌ సూచీలు బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ, జర్మనీ డాక్స్, ఫ్రాన్స్‌ కాక్‌లు కూడా 1 శాతం మేర నష్టపోయాయి. అమెరికా సూచీలు కూడా 1 శాతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. ఇంత భారీ గ్యాప్‌డౌన్‌తో అమెరికా మార్కెట్‌ ప్రారంభంకావడం గత కొద్ది వారాల్లో ఇదే ప్రధమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement