నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌

Sensex down 106 points, Nifty ends at 10821, banking stocks weigh - Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

పతనమైన రూపాయి

బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ

106 పాయింట్లు పతనమై 36,107కు సెన్సెక్స్‌

34 పాయింట్లు తగ్గి 10,822కు నిఫ్టీ  

బ్యాంక్‌ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్‌బ్రెంట్‌ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి.  

198 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్‌ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

బ్యాంక్‌ షేర్లకు నష్టాలు  
లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై,      నష్టాల్లోనే ముగిశాయి.  
∙వాటెక్‌ వాబాగ్‌ షేర్‌ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్‌ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్‌ బ్యాంక్‌ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్‌ జోరుగా పెరుగుతోంది.  

► స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్‌ ఫార్మా షేర్లు ఈ         జాబితాలో ఉన్నాయి.  

► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.


Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top