వేల కోట్ల కుంభకోణం : కార్వీకి సెబీ షాక్!

SEBI bans Karvy Broking for nearly Rs 2,000 crore in defaults - Sakshi

న్యూఢిల్లీ: ఓ క్లయింటుకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్‌ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది.

క్లయింట్‌ సెక్యూరిటీల విషయంలో కేఎస్‌బీఎల్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఎన్‌ఎస్‌ఈ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. క్లయింట్ల షేర్లు మరింతగా దుర్వినియోగం కాకుండా నియంత్రణ సంస్థ తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ 12 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ హోల్‌ టైమ్‌ మెంబర్‌ అనంత బారువా వ్యాఖ్యానించారు. క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను డిపాజిటరీలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సెబీ సూచించింది. అభ్యంతరాలేమైనా ఉన్న పక్షంలో 21 రోజుల్లోగా తెలియజేయాలంటూ కేఎస్‌బీఎల్‌కు సమయమిచ్చింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top