ఎస్‌బీఐ రుణ మాఫీ.. 20 వేల కోట్లపైనే!

SBI loan waiver is over 20 crores! - Sakshi

గతేడాది రైటాఫ్‌ చేసిన మొత్తం

న్యూఢిల్లీ: మొండిబకాయిల ఊబిలో కూరుకుపోయిన దేశీ బ్యాంకింగ్‌ దిగ్గజం.. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రక్షాళనపేరుతో భారీమొత్తంలోనే రుణాలను మాఫీ(రైటాఫ్‌) చేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ.20 వేల కోట్లకు పైగానే మొండిబాకీలను రైటాఫ్‌ చేసినట్లు తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల్లోకెల్లా ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. గతేడాది పీఎస్‌బీలు అన్నీ కలిపి రూ.81,683 కోట్లను రైటాఫ్‌ చేశాయి.

కాగా, ఈ రైటాఫ్‌ కాలంలో ఇంకా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదు. 2012–13 ఏడాదిలో పీఎస్‌బీలు రైటాఫ్‌ చేసిన రుణాలు రూ.27,231 కోట్లు. అంటే ఐదేళ్లలో ఈ మొత్తం దాదాపు మూడు రెట్లు పెరగడం విశేషం. ఇక మిగతా పీఎస్‌బీల విషయానికొస్తే.. పంజాబ్‌ నేషనల్‌బ్యాంక్‌ (పీఎన్‌బీ) 2016–17లో రూ.9,205 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ) రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.5,545 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) రూ.4,348 కోట్ల చొప్పున మొండి బకాయిలను రైటాఫ్‌ చేసుకున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) తొలి ఆరు నెలల కాలంలో(డిసెంబర్‌ వరకూ) పీఎస్‌బీలు ఏకంగా రూ.53,625 కోట్లను రైటాఫ్‌ చేయడం ఎన్‌పీఏల తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం(2017 సెప్టెంబర్‌ నాటికి) మొత్తం 21 పీఎస్‌బీల్లో 9 బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు వాటి మొత్తం రుణాల్లో 17 శాతానికి ఎగబాకాయి. ఇక 14 పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు 12 శాతంపైనే ఉన్నాయి.

పీఎస్‌బీలు ఎప్పుడు ఎంతెంత మాఫీ...
ఏడాది            రైటాఫ్‌ మొత్తం
2012–13    రూ.27,231 కోట్లు
2013–14    రూ.34,409 కోట్లు
2014–15    రూ.49,018 కోట్లు
2015–16    రూ.57,585 కోట్లు
2016–17    రూ.81,683 కోట్లు
2017–18    రూ.53,625 కోట్లు
(డిసెంబర్‌ నాటికి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top