సాగర్‌ సిమెంట్స్‌ భారీ విస్తరణ

Sagar Cements in acquisition mode - Sakshi

2021 నాటికి 8.25 మిలియన్‌  టన్నులకు సామర్థ్యం 

మధ్యప్రదేశ్‌లో కొత్తగా  సిమెంటు ప్లాంటు ఏర్పాటు 

రూ.426 కోట్లతో వేస్ట్‌ హీట్‌  రికవరీ పవర్‌ ప్రాజెక్టు 

ఒడిషాలో రూ.308 కోట్లతో  గ్రైండింగ్‌ యూనిట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ భారీగా విస్తరిస్తోంది. 2021 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 8.25 మిలియన్‌ టన్నులకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 5.75 మిలియన్‌ టన్నులు. విస్తరణలో భాగంగా మిలియన్‌ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వద్ద నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.150 కోట్లను సద్గురు సిమెంట్‌లో (ఎస్‌సీపీఎల్‌) పెట్టుబడిగా పెట్టనుంది. అలాగే వేస్ట్‌ హీట్‌ రికవరీ పవర్‌ ప్రాజెక్టును రూ.426 కోట్ల వ్యయంతో స్థాపించనున్నారు. రెండు ప్రాజెక్టులు పూర్తి అయ్యాక ఎస్‌సీపీఎల్‌ ఈక్విటీలో సాగర్‌ సిమెంట్స్‌కు 65 శాతం వాటా ఉంటుంది. 

మరో కంపెనీలో 100 శాతం.. 
ఒడిషాలోని జాజ్‌పూర్‌ వద్ద ఉన్న జాజ్‌పూర్‌ సిమెంట్స్‌లో (జేసీపీఎల్‌) సాగర్‌ సిమెంట్స్‌ దశలవారీగా 100 శాతం వాటా దక్కించుకోనుంది. ఇందుకు ఈ కంపెనీలో సాగర్‌ సిమెంట్స్‌ రూ.108 కోట్లు పెట్టుబడి చేయనుంది. జేసీపీఎల్‌ ద్వారా 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.308 కోట్లతో నెలకొల్పనున్నారు. ఒడిషా ప్రభుత్వం, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు వచ్చిన తర్వాతే ఈ పెట్టుబడి ఉంటుందని సాగర్‌ సిమెంట్స్‌ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్‌ వారంట్లను జారీ చేయాలన్న నిర్ణయానికి బుధవారం సమావేశమైన బోర్డు సమ్మతి తెలిపింది. 

నూతన మార్కెట్లకు.. 
సాగర్‌ సిమెంట్స్‌ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లలో పట్టిష్గంగా విస్తరించింది. మహారాష్ట్ర, ఒడిషాలోకి సైతం ప్రవేశించింది. ఇండోర్‌ ప్లాంటు సాకారమైతే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్థాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇండోర్, వడోదర, భోపాల్, అహ్మదాబాద్‌ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసి వచ్చే అంశం. అలాగే ఒడిషా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు చత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో సిమెంటు మార్కెట్‌ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కత, రాంచి, జంషెడ్‌పూర్‌ పట్టణాలను కవర్‌ చేయవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top