ఐదేళ్లలో అతిపెద్ద జంప్‌

Rupee likely to stage sharp recovery - Sakshi

రూపాయి ఒకేరోజు112 పైసలు అప్‌

70.44 వద్ద ముగింపు

క్రూడ్‌ భారీ పతనమే కారణం  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం భారీగా లాభపడింది. ఒకేరోజు 112 పైసలు బలపడి 70.44 వద్ద ముగిసింది.  రూపాయి కేవలం ఒక్కరోజే ఈ స్థాయిలో రికవరీ కావడం గడచిన ఐదేళ్లో ఇదే తొలిసారి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పతనం కావటం, దీనితో దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటుపై భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 71.34 వద్ద ప్రారంభమైన రూపాయి, అటు తర్వాత క్రమంగా పుంజుకుంది. మరింతగా విశ్లేషిస్తే... అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది.

అయితే 71–70 స్థాయిలో తిరుగుతోంది.  కరెన్సీ పరంగా చూస్తే, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ,  ప్రామాణిక వడ్డీరేటు సమీప భవిష్యత్తులో ‘‘తటస్థ స్థాయి’’లోనే ఉంటుందని సూచించారు. ఈ ప్రకటనతో డాలర్‌ ఇండెక్స్‌ తదుపరి ర్యాలీ అంచనాలను నీరుగార్చాయి.  బుధవారం ఫెడ్‌ ఫండ్‌ రేటు పెరగబోదన్న అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు వార్తలు కూడా రూపాయి బలోపేతం సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 32 డాలర్లు కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్సే్చంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర మంగళవారం ఒక దశలో 47.50 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. 

ఇక భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ బేరల్‌ ధర మంగళవారం ట్రేడింగ్‌ ఒక దశలో 57.23ని తాకింది. రెండు నెలల క్రితం ఈ ధర 86.74 డాలర్ల వద్ద ఉంది. ఈ వార్త రాసే 9 గంటల సమయంలో నైమెక్స్, బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు వరుసగా 47.80, 57.30 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో మళ్లీ ప్రపంచం మాద్యంలోకి జారిపోయే అవకాశం ఉందన్న భయాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు కోత వంటి అంశాలు క్రూడ్‌ పరుగును అడ్డుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్‌ భారీ స్థాయిల్లో ఉండటం తగదన్న అమెరికా అధ్యక్షుని ప్రకటనలు, క్రూడ్‌ నిల్వలు పెరగడం వంటి అంశాలూ క్రూడ్‌ ధరలు దిగిరావడానికి కారణం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో తిరిగి క్రూడ్‌ మళ్లీ 30 డాలర్లు పైకి ఎగసి, ఇటీవలి గరిష్ట స్థాయిలను చూడ్డం కష్టమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top