ఆందోళనకర స్థాయిలో పతనం కాలేదు

Rupee has not depreciated to a worrying level, says Raghuram Rajan - Sakshi

రూపాయిపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ విశ్లేషణ

క్యాడ్‌పై మాత్రం జాగ్రత్త అవసరమని సూచన  

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఆందోళనకరమైన స్థాయిలో పడిపోలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ– క్యాడ్‌)పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్‌. ఈ పరిమాణం పెరిగిన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.  జూలైలో భారత్‌ వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) ఐదేళ్ల గరిష్ట స్థాయి 18 బిలియన్‌ డాలర్లకు చేరడం, దీనితో క్యాడ్‌పై నెలకొన్న భయాల నేపథ్యంలో  రాజన్‌  ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు చూస్తే...

ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం–ద్రవ్యలోటు కట్టడిలోనే ఉం ది. సమస్య క్యాడ్‌తోనే. చమురు అధిక ధరల ప్రతికూలత క్యాడ్‌పై పడుతోంది. దీనికి దేశం అధిక డాలర్ల బిల్లును వెచ్చించాల్సి వస్తోంది.  
   ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాల వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలపై ప్రతిదేశం సారించాల్సిన సమయం ఇది.  
   ఇక ఎన్నికల సమయం అయినందున భారత్, బ్రెజిల్‌ వంటి దేశాలు ప్రభుత్వ వ్యయాలు గాడితప్పకుండా చర్యలు తీసుకోవాలి.  
    భారత్‌ వృద్ధి గణాంకాలను వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. వృద్ధి 7.5% స్థాయిలో ఉంటుందన్నది నా అభిప్రాయం.  
    ఇక బ్యాంకింగ్‌ మొండి బకాయిల సమస్య తీవ్రమైనది. దీని పరిష్కార దిశలో బ్యాంకింగ్‌ పాలనా యంత్రాంగాల మెరుగుదల కీలకం.  
    అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత కారణంగా భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతానికి విస్తరిస్తుందని అంచనా. 2017–18లో ఇది 1.5 శాతం.  
    రూపాయి ఇప్పటికీ అధిక విలువలో ఉందని, డాలర్‌తో పోలిస్తే 70–71 స్థాయి రూపాయికి తగిన విలువనేది విశ్లేషకుల వాదన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top