మెరిసిన డాలర్‌.. పెరిగిన క్రూడ్‌!

Rupee gains 13 paise to 69.97 vs USD on easing crude price - Sakshi

రూపాయికి 44 పైసలు నష్టం

69.67 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 44 పైసలు పడింది. దీనితో 69.67కు రూపాయి జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ పటిష్ట ధోరణి, పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తాజాగా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది.  రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ కిందకు జారుతోంది. ఈ కాలంలో 126పైసలు పడింది. రూపాయి ట్రేడింగ్‌ 69.40 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 69.71 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.

క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. మరింత బలపడి గత నెల రోజులుగా 68–70  శ్రేణిలో తిరుగుతోంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ రూపాయిపై వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్‌ క్రూడ్‌ ధర 64 వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ దిగుమతి చేసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ 71 వద్ద ట్రేడవుతోంది. ఈ రేట్లు 5 నెలల గరిష్ట స్థాయి.  డాలర్‌ ఇండెక్స్‌ 96.66 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.59 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top