 
															మార్కెట్‌కు రిలయన్స్ జోష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది.
	ఫలితాల దన్నుతో 5.6% పెరిగిన ఆర్‌ఐఎల్
	* 150 పాయింట్ల లాభంతో 27,365కు సెన్సెక్స్
	* 37 పాయింట్ల లాభంతో 8,275కు నిఫ్టీ
	రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ వంటి సెన్సెక్స్ షేర్లతో పాటు ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు ఎగిశాయి.  దీంతో  స్టాక్ మార్కెట్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాల బాటపట్టింది.
	
	బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 27,365 పాయింట్ల వద్ద. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,275  పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల గరిష్టం. అయితే లోహ, బ్యాంక్ షేర్లు పతనమవడం స్టాక్‌మార్కెట్ లాభాలకు కళ్లెం పడింది. ఆదాయపు పన్ను లావాదేవీలపై విదేశీ ఇన్వెస్టర్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల రెండు రోజుల సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కావడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
	
	ఇవి సానుకూలంగా జరుగుతాయన్న అంచనాలే దీనికి కారణం.  టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారని, ఇది  సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని మార్కెట్ నిపుణులంటున్నారు.
	 
	రిలయన్స్ జోరు..
	ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీంతో ఈ షేర్ 5.6 శాతం లాభపడి రూ.963 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు లాభాల్లో ముగిశాయి.1,565 షేర్లు లాభాల్లో, 1,157 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
