రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ నేటి నుంచి

Reliance Industries rights issue starts today - Sakshi

రైట్స్‌ ధర షేరుకి రూ. 1257 

మంగళవారం ముగింపు రూ. 1409

జూన్‌ 3న ముగియనున్న ఇష్యూ

తొలుత 25 శాతం ధర చెల్లించవచ్చు

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రైట్స్‌ ఇష్యూ నేటి(20) నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకి రూ. 1257 ధరను కంపెనీ నిర్ణయించింది. అంటే కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు తమ వద్దగల ప్రతీ 15 షేర్లకుగాను 1 షేరుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ జూన్‌ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 42.26 కోట్ల షేర్లను జారీ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 53,125 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 2.2 శాతం నీరసించి రూ. 1409 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే రైట్స్‌ ధర రూ. 152 డిస్కౌంట్‌లో లభిస్తోంది. కాగా.. రైట్స్‌కు దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లు తొలుత 25 శాతం అంటే రూ. 314.25 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 628.5ను 2021 నవంబర్‌లోగా కంపెనీ పేర్కొన్న విధంగా చెల్లించవలసి ఉంటుంది. ఆర్‌ఐఎల్‌ను 2021 మార్చికల్లా రుణరహిత కంపెనీగా నిలిపే యోచనలో ఉన్నట్లు చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గతంలోనే పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల డిజిటల్‌, మొబైల్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌లో స్వల్ప సంఖ్యలో వాటాలను విక్రయిస్తున్నారు కూడా. గత నెల రోజుల్లో రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తోపాటు.. పీఈ సంస్థలు విస్టా పార్టనర్స్‌, సిల్వర్‌ లేక్‌, జనరల్‌ అట్లాంటిక్‌ సంయుక్తంగా 14.81 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 67,195 కోట్లను సమీకరించగలిగింది కూడా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top