డిజిటల్‌ వాలెట్లకు ఎదురుదెబ్బ : రేపే ఆఖరి తేదీ

RBI refuses to extend KYC compliance deadline beyond February 28 - Sakshi

న్యూఢిల్లీ : పేటీఎం, ఓలా మనీ, గూగుల్‌ తేజ్‌ వంటి డిజిటల్‌ వాలెట్లకు లేదా ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కస్టమర్ల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన కేవైసీ-కంప్లీయెన్స్‌ తుది గడువును మరింత పొడిగించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిరాకరించింది. రేపే ఆఖరి తేదీగా ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే సరిపోయేంత సమయం ఇచ్చామని, మరోసారి ఈ గడువును పొడిగించలేమని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకులు ప్రమోట్‌ చేసే 50 వాలెట్లతో పాటు 55 ప్రీపెయిడ్‌ వాలెట్లు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి. వీరందరూ ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియను పూర్తిగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

తొలుత ఈ వాలెట్ల కస్టమర్లందరూ 2017 డిసెంబర్‌ 31 వరకు కేవైసీ వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే తమ కేవైసీ వివరాలను సమర్పించారు. అయితే తక్కువ మంది మాత్రమే కేవైసీ వివరాలు సమర్పించడంతో, మిగతా యూజర్లను కోల్పోతామేమోనని డిజిటల్‌ వాలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదురహిత ఆప్షన్ల నుంచి మళ్లీ నగదుకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. తమ వాలెట్‌ను లేదా పీపీఐ అకౌంట్‌ను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడంతో ఈ ప్ర​క్రియ పూర్తవుతుంది. రెసిడెన్షియల్‌ ప్రూఫ్‌ లాంటి మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ ప్రక్రియలో అవసరం పడనున్నాయి. 

కేవైసీ వివరాలు కోరడంపై వాలెట్ల యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యూజర్లు దీనిపై ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదని ఆర్‌బీఐ తెలిపింది. తుది గడువు వరకు కేవైసీ సంబంధిత వివరాలను పీపీఐ యూజర్లకు ఇవ్వకపోయినప్పటికీ, కస్టమర్లు తమ నగదును కోల్పోరని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. ఇప్పటికీ కేవైసీ ఫార్మాలటీలు పూర్తి చేయని వారికి ఫిబ్రవరి 28 తర్వాత కూడా తమ బ్యాలెన్స్‌ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చని లేదా పీపీఐ అకౌంట్‌ను క్లోజ్‌ చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.. ఈ బ్యాలెన్స్‌ నగదును మీ బ్యాంకు అకౌంట్లకు ట్రాన్సఫర్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top