లో–కాస్ట్‌ గృహాలకు ఊతం!

RBI Hikes Housing Loan Limits Under Priority Sector Lending - Sakshi

రూ.35 లక్షల వరకూ ‘ప్రాధాన్యతా రంగ’ రుణం

మెట్రోల్లో నిర్మాణ వ్యయ పరిమితి రూ.45 లక్షలు

ఇతర ప్రాంతాల్లో అయితే ఇది రూ.30 లక్షలు

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆర్‌బీఐ  

ముంబై: అందరికీ గృహం, ఇందుకు సంబంధించి రుణ సౌలభ్యానికి  ‘ప్రాధాన్యతా పరిధి’ విస్తరణ లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం కీలక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాధాన్యతా రంగం  కింద గృహ రుణ (పీఎస్‌ఎల్‌) పరిమితుల్ని పెంచటం ఈ నోటిఫికేషన్‌ ప్రధాన ఉద్దేశం. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే...

  మెట్రో నగరాలు... అంటే 10 లక్షలు ఆ పైబడి ప్రజలు నివసిస్తున్న నగరాల్లో ఇక రూ.35 లక్షల వరకూ గృహ రుణాన్ని ప్రాధాన్యతా రంగ  రుణంగానే పరిగణిస్తారు. అయితే ఆ ఇంటి నిర్మాణ వ్యయం రూ.45 లక్షలు దాటకూడదు.  
   ఇతర నగరాల్లో రూ.30 లక్షల వరకూ గృహ నిర్మాణ వ్యయానికి రూ.25 లక్షల వరకూ లభించే గృహ రుణాన్ని ప్రాధాన్యతా రంగంగా పరిగణించడం జరుగుతుంది.  

ప్రాధాన్యతా  పరిధి ప్రయోజనం ఏమిటి?
ప్రాధాన్యతా రంగం పరిధిలో రుణమంటే... దీనిపై విధించే వడ్డీ, మార్కెట్‌ రేటుకన్నా తక్కువగా ఉంటుంది.  

ప్రస్తుత పరిస్థితి ఇదీ...
ప్రస్తుతం మెట్రోల్లో రూ.28 లక్షల వరకూ గృహ రుణం ప్రాధాన్యతా రంగం పరిధిలోకి వస్తోంది. ఇతర ప్రాంతాలకు సంబంధించి ఈ పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది. మెట్రోల్లో రూ.35 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.25 లక్షల వ్యయాలకు లోబడి గృహాలను నిర్మించుకుంటేనే ప్రాధాన్యతా రంగం పరిధిలో వడ్డీ సౌలభ్యత లభిస్తోంది.

కుటుంబ ఆదాయ పరిమితీ పెంపు...
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌), దిగువ ఆదాయ గ్రూప్‌ (ఎల్‌ఐజీ)లకు హౌసింగ్‌ ప్రాజెక్టుల విషయమై రుణానికి ప్రస్తుత కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షలు. దీనిని కూడా ఆర్‌బీఐ సవరించింది. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి వార్షికాదాయ పరిమితిని రూ.3 లక్షలకు,. ఎల్‌ఐజీకి సంబంధించి రూ.6 లక్షలకు సవరించారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్దేశించిన ఆదాయ విధానం ప్రకారం ఈ మార్పులు చేశారు. నిజానికి ఆయా నిబంధనల సడలింపు విషయాన్ని జూన్‌ 6 న జరిగిన పరపతి విధాన సమీక్ష సందర్భంగానే ఆర్‌బీఐ ప్రకటించింది. ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top