18వేల మంది బ్యాంకు ఉద్యోగులు బదిలీ

Public sector banks to transfer officers completing 3 years - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగుల బదిలీకి తెరలేసింది. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 18వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయ్యారు. సోమవారమే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ బదిలీ విషయంపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఓ ప్రకటన జారీచేసింది. 2017 డిసెంబర్‌ 31 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా క్లరికల్‌ స్టాఫ్‌ ఎవరైతే 2017 డిసెంబర్‌ 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటారో వారిని కూడా బదిలీ చేయాలని తెలిపింది. వెంటనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు దాదాపు 18 వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయినట్టు తెలిసింది.  

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల మేరకు, ప్రతి మూడేళ్లకు ప్రతి అధికారిని బదిలీ చేస్తుంటామని ఓ బ్యాంకు చెప్పింది. మూడేళ్ల కంటే ఎక్కువగా ఒకే పోస్టులో ఆఫీసర్‌ ఉంచమని పేర్కొంది. క్లరికల్‌ స్టాఫ్‌ విషయంలోనూ ఇదే అమలు చేస్తామని తెలిపింది. అయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీకి, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్‌ అధికారి మెహుల్‌ చౌక్సికి ఐదేళ్ల కంటే ఎక్కువగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న అధికారులే సాయం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఈ ఆదేశాలు జారీచేసింది. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైందని, అప్పటి నుంచి బ్యాంకు అధికారులు నీరవ్‌ మోదీకి సాయం చేసినట్టు వెల్లడైంది. నీరవ్‌ సాయం చేసిన ఇద్దరు పీఎన్‌బీ అధికారులు గత ఐదారేళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. నిజానికి ఇలా జరగకూడదు, ఈ హోదాలో పని చేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. కానీ ఆ విధమైన మార్పు పీఎన్‌బీలో జరుగలేదు. ఈ క్రమంలో బ్యాంకు అధికారుల బదిలీలు చేపట్టాలని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశించింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top