
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. పీఎన్‌బీ స్కాంతో సిస్టమ్‌కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. సిస్టమ్‌లో ఎక్కువ పారదర్శకత, నైతిక కార్పొరేట్ పాలన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించనవి. కొంతమంది వ్యక్తులతో కొంత సిస్టమ్ విఫలమైంది. అదేసమయంలో మనకు, సిస్టమ్‌కు చెడ్డ పేరు వచ్చింది’ అన్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 58వ నేషనల్ కాస్ట్ కన్వెక్షన్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడారు. కొంత మంది అధికారులతో కుమ్మకై, డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ పీఎన్‌బీలో సుమారు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి రావడంతో, బ్యాంకింగ్ సిస్టమ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఎక్కువ పారదర్శకత, నైతిక కార్పొరేట్ పాలన ఉండాలని ఉపరాష్ట్రపతి కూడా అభిప్రాయం వ్యక్తంచేశారు.