రూ.11 పెరిగిన పెట్రోల్‌ ధర

Petrol Up By Rs 11 Since Karnataka Poll - Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వినియోగదారులకు భారీ ఎత్తున్న జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తుతున్న ఇంకా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరుసగా 12వ రోజు ఆయిల్‌ ధరలు పైకి ఎగిశాయి. నేడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 32 పైసలు, 18 పైసల చొప్పున పెరిగాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్తాయనే కారణంతో దాదాపు 19 రోజుల పాటు ఈ ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. అయితే కర్ణాటక ఎన్నికలు అలా అయిపోగానే.. ఇలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు వాత పెట్టడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కర్నాటక ఎన్నికలు  ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధర 11 రూపాయల మేర పెరగగా... డీజిల్‌ ధర రూ.7.27 ఎగిసింది. దీంతో నేడు లీటరు పెట్రోల్‌ ధర మెట్రోపాలిటన్‌ నగరాల్లో.. ఢిల్లీలో రూ.77.83గా ఉండగా.. ముంబైలో రూ.85.65గా, కోల్‌కతాలో రూ.80.47గా, చెన్నైలో రూ.80.80గా ఉంది. సమీక్షించిన ధరల ప్రకారం లీటరు డీజిల్‌ ధర.. ఢిల్లీలో రూ.68.75గా, ముంబైలో రూ.73.2గా, చెన్నైలో రూ.72.58గా, కోల్‌కతాలో రూ.71.30గా ఉన్నాయి. 

మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా  కాంగ్రెస్‌ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి.  పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపినప్పటికీ, భారీగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రష్యా నుంచి సరఫరా పెరగనుందనే సంకేతాలతో ఈ ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో దేశీయంగా ఏమైనా ధరలు తగ్గే అవకాశముందో లేదో చూడాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటి పన్నులు తగ్గిస్తే, దాని ప్రభావం సబ్సిడీలపై పడనుందని కేంద్రం చెబుతోంది. అయినప్పటికీ, ధరల పెంపును తగ్గించడానికి దీర్ఘకాలిక పరిష్కారం కనుగొంటామని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని ఒక్క రూపాయి మేర తగ్గించినా.. ప్రభుత్వానికి 130 బిలియన్‌ రూపాయిలు నష్టం చేకూరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కోతలో కాస్త వెనుకంజ వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ కిందకి తీసుకురావాలని కూడా నితిన్‌ గడ్కారీ అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top