దసరా కానుకగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గింపు

Petrol, Diesel Prices Drop On The Occasion Dussehra - Sakshi

ముంబై : దసరా పండుగ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు దిగొచ్చాయి. గత 13  రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న ఈ ధరలు, నేడు కాస్త ఉపశమనం కలిగించాయి. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో పెట్రోల్ 21 పైసలు తగ్గగా.. చెన్నైలో 22 పైసలు తగ్గింది. ఇక నాలగు మెట్రోల్లో డీజిల్‌ ధర 11 పైసలే తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.62గా, కోల్‌కతాలో రూ.84.44గా, ముంబైలో రూ.88.08గా, చెన్నైలో రూ.85.88గా ఉన్నాయి. ఇక డీజిల్‌ ధరలు న్యూఢిల్లీలో లీటరు రూ.75.58గా, ముంబైలో రూ.79.24గా, చెన్నైలో రూ.79.93గా, కోల్‌కతాలో రూ.77.43గా నమోదయ్యాయి. గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించాక ఒక్క రోజు మాత్రమే ఇంధన ధరలు తగ్గాయి. మళ్లీ వెంటనే పెరగడం ప్రారంభించాయి. అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్‌ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది. 

ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ సమ్మె...
పెట్రోల్‌ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్‌ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top