రోబోలతో కూలనున్న కొలువులు..

People Are Set To Lose Their Jobs In Robot Revolution - Sakshi

లండన్‌ : రోబోలతో సామాజిక అశాంతి తప్పదని.ఇవి గుంపగుత్తగా ఉద్యోగాలను కొల్లగొడతాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ ఆండీ హెల్దానే హెచ్చరించారు. మనిషి ఆలోచించి చేసే పనులను సైతం యంత్రాలు అవలీలగా చేసే రోజులను నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచం ముందుంచనుందని ఆండీ స్పష్టం చేశారు. విక్టోరియా రోజులకు మించి ఈ మార్పులు మానవ జాతి పెను విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. అకౌంటెన్సీ సహా పలు రంగాలు రోబోల ధాటికి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో కోల్పోతాయని చెప్పారు.

ఆటోమేషన్‌ రాకతో గల్లంతయ్యే ఉద్యోగాలను కాపాడుకోవడానికి అభ్యర్థులు అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడమే ప్రత్యామ్నాయమన్నారు. దీర్ఘకాలం ఉద్యోగాలను కోల్పోయే క్రమంలో బతుకుతెరువు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సామాజిక అశాంతికీ దారితీయవచ్చని హెచ్చరించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలు అధికంగా శ్రమతో కూడుకున్న పనులనే యంత్రాలు చేపట్టగా, నాలుగో పారిశ్రామిక విప్లవం ఈ మూడింటికీ భిన్నమైనదన్నారు.

ఆధునిక యంత్రాలు మనుషులు ఆలోచించి చేసే పనులనే కాకుండా, నైపుణ్యంతో కూడిన పనులనూ చేస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు రానున్న రెండు దశాబ్ధాల్లో నూతన సాంకేతిక మార్పులతో బ్రిటన్‌లో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం అవుతాయని అకౌంటెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే.

రిటైల్‌, రవాణా, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఈ నివేదిక అంచనా వేసింది. ఇతర రంగాలు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయని నివేదిక స్పష్టం చేసింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇంటెలిజెంట్‌ కంప్యూటర్స్‌ అన్నిరంగాల్లోనూ ఉద్యోగాలు కుదేలవుతాయని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top