కృత్రిమ మేధ.. వికృత నీడ | The use of Artificial Intelligence is going astray | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ.. వికృత నీడ

Mar 19 2026 5:23 AM | Updated on Mar 19 2026 5:45 AM

The use of Artificial Intelligence is going astray

∙మన గడపలోకే.. 'ఏ'మరపాటు వదిలె'ఐ'

మార్ఫింగ్‌ కీచకులతో తస్మాత్‌ జాగ్రత్త

బహిరంగ ప్రదేశాల్లో తీసిన వీడియోలు, ఫొటోలతో మార్ఫింగ్‌ వీడియోలు

ఆరిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు) సహకారంతో దురాగతాలు

విద్యాలయాలకు పాకిన వికృత చేష్టలు    

మార్ఫింగ్‌.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్‌ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్‌ మీడియాలో పోస్టులు, వాట్సాప్‌ స్టేటస్‌లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది.  

టెక్కలి : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. 

వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్‌ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు.  

కఠిన శిక్షలు
» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్‌ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్‌ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. 
» ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌కు పాల్పడితే సెక్షన్‌ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.  
» ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. 
» మరొకరి సంతకాన్ని డిజిటల్‌ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.  
» వీటితో పాటు ఫేక్‌ న్యూస్‌ సృష్టించడం, వాయిస్‌లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్‌ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్‌ఎస్‌ కింద  కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.  

మంచి పనులకు ఉపయోగించాలి 
కంప్యూటర్‌ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నా­యి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్‌ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్‌ఓడీ, సీఎస్‌ఈ, ఏఐఎంఎల్‌

దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు 
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్‌గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం.   – ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్‌

కచ్చితంగా దొరికిపోతారు 
అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్‌కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్‌ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి.  – కె.నిహారిక, సీఎస్‌ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్‌ లెర్నింగ్‌) ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల , టెక్కలి  

డేటా షేర్‌ కాకుండా చూసుకోవాలి 
సోషల్‌ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్‌ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్‌.చిరంజీవి, సీఎస్‌ఈ, ఏఐఎంఎల్‌

మార్ఫింగ్‌ జరిగితే ఆందోళన వద్దు 
ఏఐ ద్వారా డీప్‌ ఫేక్‌ మార్ఫింగ్‌ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్‌ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి.       – ప్రియాంకపాడి, సీఎస్‌ఈ, ఏఐఎంఎల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement