తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్! | Patanjali going to take on McDonalds in food business | Sakshi
Sakshi News home page

తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!

May 5 2017 10:52 AM | Updated on Sep 5 2017 10:28 AM

తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!

తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!

పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్‌ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్‌ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కేఎఫ్‌సీ, సబ్‌వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి.. అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటి వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాందేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి.. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది.

పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్‌లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని పతంజలి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోంది. భారతీయులకు అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎందుకని.. ఆహారంతో పాటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తే మంచిది కదా అని ఆయన అంటున్నారు. ఆహార పదార్థాలు, పౌష్టిక పదార్థాలు, సౌందర్య సాధనాలు.. వీటన్నింటికీ ఉన్నట్లే రీటైల్ ఫుడ్ చైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement