నంబర్‌–1పై ఓయో కన్ను

Oyo will be the world largest hotel chain by 2023 - Sakshi

2023 నాటికి సాధించాలని టార్గెట్‌

మారియట్‌ను అధిగమించడానికి ప్రణాళిక

ప్రతి నెలా అదనంగా 50,000 గదులు

సంస్థ సీఈవో రితేష్‌ అగర్వాల్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్‌ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్‌ హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్‌ గదులను తన నెట్‌వర్క్‌ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్‌–1 హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్‌ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్‌ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023కి మారియట్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్‌ అగర్వాల్‌ తెలిపారు.  

నాలుగున్నరేళ్లలోనే...  
ఓయో ఓ స్టార్టప్‌గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్‌ బ్రాండ్‌గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్, చైనా, బ్రిటన్‌ తదితర దేశాల్లో 3,30,000 హోటల్‌ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్‌గా  (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది.  ‘‘ప్రతి నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. దీన్ని బట్టి చూస్తే 2023 నాటికి అదనంగా 25 లక్షల గదుల స్థాయికి చేరతాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్‌ చెయిన్‌ సామర్థ్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం’’ అని అగర్వాల్‌ తెలిపారు. ఓయో బడ్జెట్‌ హోటల్‌ చైన్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది.

ప్రధానంగా ఓయోకు భారత్, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్‌ గదులుండగా, బ్రిటన్, యూఏఈ, ఇండోనేసియా, మలేసియా, నేపాల్‌కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో భాగమైన దుబాయ్, అబు ధాబి, షార్జా వంటి మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు అగర్వాల్‌ చెప్పారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్‌ మార్కెట్లలో విస్తరించేందుకు ఈ మార్కెట్లు దోహదపడగలవని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉందని తెలిపారు. చైనాలో ప్రతి నెలా సుమారు 40,000 పైచిలుకు గదులు ఫ్రాంచైజీ, లీజ్డ్‌ విధానంలో అందుబాటులోకి తెస్తున్నామని అగర్వాల్‌ వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో చేరిన తర్వాత ఆయా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేటు 25 శాతం నుంచి సుమారు 70 శాతం దాకా పెరిగిందని పేర్కొన్నారు.  

సాఫ్ట్‌బ్యాంకు దన్ను
కాలేజీ స్థాయి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన రితేష అగర్వాల్‌ 2013లో ఓయోను ప్రారంభించారు. ఓయో వివిధ  హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని, సిబ్బందికి తగిన శిక్షణనిస్తుంది. లినెన్‌ నుంచి బాత్‌రూమ్‌ ఫిటింగ్స్‌ దాకా అన్నింటినీ నిర్దిష్ట ప్రమాణాలకు అప్‌గ్రేడ్‌ చేస్తుంది. ఆ తర్వాత ఆయా హోటల్స్‌ను తమ వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌ చేస్తుంది. తమ వెబ్‌సైట్‌ ద్వారా జరిగే బుకింగ్స్‌పై ఆయా హోటల్స్‌ నుంచి 25 శాతం కమీషన్‌ తీసుకుంటుంది. సాఫ్ట్‌బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్‌లో బిలియన్‌ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్‌ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్‌ డాలర్లను భారత్, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్‌లో 180 నగరాల్లో ఓయో 1,43,000 గదులను నిర్వహిస్తోంది.

గతేడాది నవంబర్‌లో చైనాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రస్తుతం 265 నగరాలకు విస్తరించింది. 1,80,000 గదులను నిర్వహిస్తోంది. గదుల సంఖ్యా పరంగా టాప్‌ టెన్‌ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది.  భారత్‌తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్‌ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్‌ బ్రాండెడ్‌ హోటల్‌ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్‌లో అందుబాటులో ఉన్న అన్‌బ్రాండెడ్‌ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ అయిన ఆదిత్యఘోష్‌ను భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్‌ దృష్టిసారించనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top