ఓలా... ఇక ఎలక్ట్రిక్‌!

Ola to launch 10000 electric vehicles over 12 months - Sakshi

వచ్చే ఏడాది కాలంలో 10వేల వాహనాలు

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ క్యాబ్‌ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా వచ్చే ఏడాది కాలంలో తన ప్లాట్‌ఫామ్‌ మీదకు 10,000 ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను (ఈవీ) తీసుకువస్తామని ప్రకటించింది. ఇందులో ఎక్కువగా ఇ–రిక్షాలుంటాయని పేర్కొంది. ‘మిషన్‌ ఎలక్ట్రిక్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2021 నాటికి తన ప్లాట్‌ఫామ్‌లోని ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంఖ్యను 10 లక్షలకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపింది.

‘మేం ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రాజెక్టును ఆవిష్కరించాం. దీన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. భారత్‌లో ఎలక్ట్రిక్‌ మొబిలిటికి ప్రాధాన్యమిస్తున్నాం. అందుకే మరిన్ని ఈవీలను ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకువస్తాం’ అని ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అందుబాటులోని స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తమ ఈవీ ఫ్లీట్‌ను మరో మూడు పట్టణాలకు విస్తరిస్తామన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు. కాగా గతేడాది మే నెలలో ఓలా తన తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లో ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్‌ క్యాబ్స్, ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్‌ బస్సులు, చార్జింగ్‌ స్టేషన్లు, రూఫ్‌టాప్‌ సోలార్‌ ఇన్‌స్టాలేషన్‌ వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top